
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్ గాయంతో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం తనకు సంబంధించిన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బుల్లెట్ కాలిలోకి దూసుకెళ్లడంతో అధిక మొత్తంలో రక్తస్రావం అవుతుండటం వల్ల తక్షణమే ఆయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని గోవిందా మేజేజర్ తెలిపారు. అయితే, కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉందన్నారు.
గోవిందా అసలు పేరు 'గోవింద్ అర్జున్ అహుజా'. ఆయన నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, డ్యాన్సర్, కమెడీయన్‌గా అందరికీ పరిచయమే. గోవిందా 165కు పైగా చిత్రాల్లో నటించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గోవిందా విజయం సాధించారు. అయితే, 2009 వరకు ఎంపీగా కొనసాగిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. 2009 సహా తర్వాతి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. సుమారు 15 ఏళ్ల తర్వాత గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో శివసేన పార్టీలో ఆయన చేరారు.