
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు మరణించగా.. ఆ తర్వాత మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా కన్నుమూశారు. ఇవాళ మరో ప్రముఖ నటుడు మృతి చెందారు. బాలీవుడ్ నిర్మాత అయిన ధీరజ్ కుమార్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.
కాగా.. ధీరజ్ కుమార్ 1965లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తన కెరీర్లో సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటించారు. 1970- 1984 మధ్య దాదాపు 21 పంజాబీ చిత్రాలలో నటించాడు. 'ఓం నమః శివాయ్' వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా 'స్వామి', 'హీరా పన్నా' 'రాతోన్ కా రాజా' వంటి లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆ తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ (1974), సర్గం (1979), క్రాంతి (1981) వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ధీరజ్ కుమార్ కొనసాగారు.
ధీరజ్ కుమార్ మరణ వార్తను ధృవీకరించిన ఆయన కుటుంబం.. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటివద్దకు తరలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విలే పార్లే వెస్ట్‌లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.