ప్రతి మనిషిలోనూ జాలి, కరుణ, దయ అనేది ఉంటుంది. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. సెంటిమెంట్‌తోనూ ‘కొట్టేస్తున్నారు’. తాజాగా నటుడు, దర్శకుడు దేవీప్రసాద్ కూడా ఇలానే మోసపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ వ్యక్తి ఫోన్ చేస్తే.. రూ. 6వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడట. ఆ తర్వాత కూడా పదే పదే డబ్బులు అడగడంతో అనుమానంతో ఆరా తీస్తే.. అతనో మోసగాడని తెలిసిందంట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తనలాగా ఇంకెవరు మోసపోవద్దని దేవీప్రసాద్ కోరాడు.
అసలేం జరిగింది?
గత నెలలో దేవిప్రసాద్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘నమస్తేసర్. నేను లింగా... గుర్తున్నానా సర్’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడట. శ్రీరంగనీతులు సినిమాలో మీతో కలిసి నటించాను అంటూ.. సెంటిమెంట్ డ్రామా స్టార్ట్ చేశాడట. ‘ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు సర్.కొన్నిరోజులుగా మలక్‌పేట యశోదాహాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్‌గా ఉన్నారు.మా దగ్గర డబ్బులు అయిపోయాయి .ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీలేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు.పదివేలు దొరికాయి.6 వేలు తక్కువయ్యింది.టైమ్ లేదుసర్.ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను’ అని దీనంగా అడుగుతూ..ఆక్సిజన్ మాస్క్‌ఉన్న పెద్దావిడ ఫోటో,హాస్పిటల్‌లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టడంతో నిజమే అనుకొని దేవీప్రసాద్ రూ. 6 వేలు గూగుల్ పే ద్వారా పంపించారట.
అలా దొరికిపోయాడు
మరుసటి రోజు కూడా మళ్లీ కాల్ చేసి ఆపరేషన్ కోసం కొంత డబ్బులు కావాలని అడగడంతో దేవీప్రసాద్‌కి అనుమానం వచ్చిందట. శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి లింగారెడ్డి గురించి అడిగితే.. ఆ పేరుతో ఉన్నవాళ్లెవరు ఈ సినిమాలో పని చేయలేదని చెప్పారట. అంతేకాదు ఆ సినిమా పేరుచెప్పి రెండునెలలక్రితం హీరోని కూడా ఇలానే డబ్బులు అడిగారని చెప్పడంతో దేవికి అసలు విషయం తెలిసిపోయింది. మూడు రోజుల తర్వాత అవే ఫోటోలను పంపించి భాషా అనే నటుడి దగ్గర కూడా అలానే చెప్పాడట. అయితే దేవిప్రసాద్ ద్వారా భాషాకు ముందే అతని గురించి తెలియడంతో లొకేషన్ పెట్టమని అడిగాడట. అతను హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడట. వెంటనే దేవిప్రసాద్ ఫోన్ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్‌లో ఉన్నాం, ట్రీట్‌మెంట్ జరుగుతుందని చెప్పాడట. దీంతో దేవిప్రసాద్ అతనిపై సీరియస్ అయ్యాడట. ఇలా తల్లిసెంటిమెంట్‌తో తనని మోసం చేశాడని.. తనలాగా ఎవరూ మోసపోవద్దనే ఈ పోస్ట్ పెడుతున్నానంటూ జరిగిన విషయం మొత్తం రాసుకొచ్చాడు.


