ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు.
వెండితెరపై తమదైన నటన, హావభావాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరికి ఘనంగా నివాళులర్పించింది ఆస్కార్ వేదిక. తెలుగు వెండతెరపై దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించారు. ఆ తర్పాత 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 24న ఆయన మరణించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
అయితే ఆస్కార్ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.
సినీ రంగానికి వారి సేవలను స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నెట్టింట అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అఫీషియల్ సైట్‌లో ఉంచామని హాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చింది.


