
పెళ్లంటే ఆషామాషీయా? బోలెడంత ఖర్చు, కట్నకానుకలు, విందుభోజనాలు.. అబ్బో ఇలా చాలానే ఉంటాయి. భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుంటూ గాల్లో తేలిపోతుంటారు వధూవరులు. కానీ ఈ మధ్య పెళ్లి పేరెత్తితే సంతోషం కన్నా భయం, అనుమానాలే ఎక్కువవుతున్నాయి. నిండు నూరేళ్లు కాదు కదా నెల తిరిగేలోపే జీవిత భాగస్వామి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ అందుకు నిలువెత్తు ఉదాహరణ!
హత్యోదంతంపై సినిమా
ఈ హత్య ఉదంతంపై సినిమా రానుందని తెలుస్తోంది. బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మేఘాలయ హనీమూన్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాడట! ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడట! తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట! తన ప్రొడక్షన్‌లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కథేంటి?
రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్‌కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు.
బలవంతంగా పెళ్లి
తమ వర్గానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా పెళ్లి చేస్తే తర్వాత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ బెదిరించినా పేరెంట్స్ లెక్కచేయలేదు. రాజా రఘువంశీతో ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమైన మూడు రోజులకే సోనమ్.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. మేఘాలయలో దాన్ని ఆచరణలో పెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను మాట్లాడి భర్తను చంపించి, దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించింది. అనుమానం రాకుండా ఉండటం కోసం.. ఏడు జన్మలవరకు మనం ఇలాగే కలిసుండాలి అంటూ రాజా ఫేస్‌బుక్ అకౌంట్‌లో తనే స్వయంగా పోస్ట్ పెట్టింది.
భర్త అంత్యక్రియల్లో ప్రియుడు
అక్కడి నుంచి ఇండోర్‌కు పారిపోయింది. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలనుకుంది. కానీ పోలీసులు సోనమ్‌ను అనుమానించడంతో ఆమె లొంగిపోయింది. ఆమె చాట్స్ చూడగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేలిపోయింది. అయితే రాజ్ కుష్వాహ ఏమీ తెలియనట్లుగా రాజా రఘువంశీ అంత్యక్రియలకు వెళ్లి అతడి తండ్రిని ఓదార్చాడు. హత్యలో తన ప్రమేయం ఉందన్న విషయం బయటపడకుండా ఉండేందుకే అలా నటించాడు. పోలీసులు సోనమ్, రాజ్ కుష్వాహతో పాటు సుపారీ గ్యాంగ్‌ను సైతం అరెస్టు చేశారు.
చదవండి: షాపింగ్‌మాల్‌లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే?