రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, విజయాలను ఆర్థిక సర్వేలో ప్రశంసించిన కేంద్రం
2014లో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం.. ‘భూభారతి’తో భూముల రికార్డుల నిర్వహణలో పెరిగిన పారదర్శకత
ధరల కట్టడిలో రాష్ట్రం జాతీయ రికార్డు.. 0.20 శాతానికే ద్రవ్యోల్బణం పరిమితం
జెన్–ఏఐ స్టార్టప్‌లలో తెలంగాణకు దేశంలోనే 4వ స్థానం
ఫార్మా హబ్‌గా హైదరాబాద్.. షీటీమ్స్, వీ–హబ్‌తో మహిళలకు భరోసా
హైదరాబాద్–వరంగల్ మధ్య ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు అవకాశం
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను, సాధించిన విజయాలను పలుచోట్ల ఉటంకించింది. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, ఐటీ, పరిశ్రమలు, స్టార్టప్‌ల వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ప్రశంసించింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలోనూ మెరుగైన పనితీరును కనబరిచిందని పేర్కొంది.
సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపు..
ఆర్థిక సర్వేలో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 2014లో 1.31 కోట్లుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఈ అద్భుత ప్రగతికి కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకమని సర్వే ప్రశంసించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు అన్నదాతకు అండగా నిలిచాయని పేర్కొంది.
అయితే సాగు విస్తీర్ణం భారీగా పెరిగినప్పటికీ వరి దిగుబడిలో తెలంగాణ ఇంకా మెరుగుపడాల్సి ఉందని సర్వే సూచించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ల తో పోలిస్తే తెలంగాణలో ఎకరానికి వచ్చే దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. అకాల వర్షాలు, వడగాడ్పులు అందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. వాతావరణాన్ని తట్టుకొనే విత్తనాలను వాడటం ద్వారా దీన్ని అధిగమించవచ్చని సర్వే సూచించింది.
పీడీఎస్ ఆహార ధాన్యాల రవాణా వాహనాల కదలికలను రియల్‌టైమ్‌లో గుర్తించేందుకు కేంద్రం ‘అన్న చక్ర’ పేరుతో ప్రవేశపెట్టిన వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసిన ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని సర్వే గుర్తించింది. భూ రికార్డుల నిర్వహణలోనూ తెలంగాణ ముందుందని.. రెవెన్యూ, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖలను అనుసంధానిస్తూ తీసుకొచ్చిన ’భూభారతి’ పోర్టల్ (ధరణికి కొనసాగింపుగా/మార్పుగా) పారదర్శకతను పెంచిందని సర్వే అభిప్రాయపడింది.
ద్రవ్యోల్బణం కట్టడి బహుబాగు..
2025–26 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–డిసెంబర్) గణాంకాల ప్రకారం తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కేవలం 0.20 శాతంగా నమోదైంది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇది భారీగా తగ్గింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలన్నింటికంటే ఇదే అత్యల్పం కావడం విశేషం. జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం సగటున 1.72 శాతంగా నమోదైంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్బణం 1.39 శాతంగా ఉండగా కర్ణాటకలో 3.14 శాతంగా ఉంది. మరోవైపు సంపద సృష్టిలోనూ తెలంగాణ సత్తా చాటింది.
సేవల రంగంలో టాప్‌గేర్
ఐటీ, పారిశ్రామిక, మహిళా సంక్షేమ రంగాల్లోనూ తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని ఆర్థిక సర్వే వివరించింది. ’వికసిత్ భారత్’లో తెలంగాణది కీలకపాత్ర అని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఐటీ, సేవల రంగంలో తెలంగాణ తన సత్తాను మరోసారి చాటుకుంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న సేవల రంగంలో దాదాపు 40 శాతం వాటా కేవలం నాలుగు రాష్ట్రాలదే కాగా అందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులతో కలిసి తెలంగాణ ఈ ఘనత సాధించింది.
అధిక ఉత్పాదకత, ఆధునిక ఐటీ సేవలు, ఫైనాన్స్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని సర్వే ప్రశంసించింది. కృత్రిమ మేధ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని, దేశంలోని మొత్తం జెన్–ఏఐ స్టార్టప్‌లలో 7 శాతం వాటాతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచిందని సర్వే తెలిపింది. బెంగళూరు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
మహిళా సాధికారతకు పెద్దపీట
మహిళా భద్రత, ఉపాధి కల్పనలో తెలంగాణ మోడల్ భేష్ అని సర్వే కితాబిచ్చింది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ భరోసా కల్పిస్తున్నాయని సర్వే ప్రశంసించింది. కొచ్చిలోని విమెన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌తోపాటు షీటీమ్స్‌ను ఆదర్శంగా పేర్కొంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన వీ–హబ్ అద్భుత ఫలితాలిస్తోందని.. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో మహిళలను అనుసంధానిస్తోందని సర్వే హైలైట్ చేసింది.
మహిళలు అన్ని రకాల పరిశ్రమల్లో, షిఫ్టుల్లో పనిచేసేలా నిబంధనలను సడలించిన 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రశంసించింది. గుజరాత్‌తోపాటు హైదరాబాద్‌లోని ఫార్మా క్లస్టర్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాయని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలుస్తున్నాయని సర్వే పేర్కొంది.
దేశంలోని 85% సిమెంట్ పరిశ్రమ కేంద్రీకృతమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రభాగంలో ఉంది. అగి్నమాపక అనుమతుల కోసం థర్డ్–పార్టీ సరి్టఫికేషన్‌ను అనుమతించి ఇన్‌స్పెక్టర్ రాజ్ విధానానికి స్వస్తి పలికిన రాష్ట్రంగా తెలంగాణను సర్వే గుర్తించింది.


