కేరళలో ఇటీవల విషాదకర ఘటన జరిగింది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన వీడియో కారణంగా అతడు తనువు చాలించాడు. ఏ తప్పూ చేయకపోయినా తన పరువు తీసిందని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మలయాళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీదేవి గోపీనాథ్ స్పందించింది.
కఠిన శిక్ష విధించాలి
'దీపక్ చావుకు కారణమైన అమ్మాయిని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉంది. తనకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క ఘటన కారణంగా ఆడజాతి మొత్తాన్ని తిడుతున్నారు. ఆడవారికి, మగవారికి విడివిడిగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అట్టముక్కలతో, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవారు కాదు, అలాగే అందరు ఆడవాళ్లు చెడ్డవారు కాదు!
ఆడవాళ్లకు రక్షణేది?
ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పదహారేళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయిని హత్యాచారం చేశాడు. అలా అని దీపక్ చావును నేను తక్కువ చేయడం లేదు. అతడికి జరిగింది మరెవరికీ జరగకూడదు. కానీ ఆడవాళ్లకు కూడా రక్షణ ఎక్కడుంది? తండ్రులు, సవతి తండ్రులు, అంకుల్స్, ఫ్రెండ్స్, సమాజంలోని ఎంతోమంది చేతిలో మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు.
ఐదు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు..
దీపక్ కేసులో అరెస్టయిన అమ్మాయిని కూడా అత్యాచారం చేయాలని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అది అతడి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నాపై అత్యాచారం చేశాడు. దయచేసి ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఏదైనా అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆడవాళ్లందరినీ రాక్షసులుగా చిత్రీకరించకండి' అని శ్రీదేవి కోరింది.
చదవండి: 2009లో ఇండస్ట్రీలో.. ఇన్నాళ్లకు నటిగా లాంచ్: స్రవంతి


