
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
రెడ్ టీమ్ బీభత్సం
కెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు.

సంజనాపై సుమన్ అసహనం
ఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.
బోరున ఏడ్చేసిన తనూజ
తర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్‌లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్
తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.