బిగ్‌బాస్ 4వ వారం విశ్లేషణ.. ఫోమ్‌తో ఫామ్‌లోకి వస్తే | Bigg Boss 8 Telugu 4th Week Analysis | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: నాలుగో వారం హౌసులో ఏమేం జరిగింది?

Sep 30 2024 1:14 PM | Updated on Sep 30 2024 1:40 PM

Bigg Boss 8 Telugu 4th Week Analysis

బిగ్‌బాస్ 8వ సీజన్‪‌లో గడిచిన వారం(4వ) హౌస్‌లోని కంటెస్టెంట్స్ మనసులోని ముసుగులు తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్స్ పర్వంలో వాడాడు బిగ్‌బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్ధం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పొచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్ళీ ఫాంలోకి వచ్చింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)

యధావిధిగా నామినేషన్స్ లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్స్ మధ్య పోటీగా నిర్వహించిన డిఫరెంట్ బెలున్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. ఒక్క నామినేషన్స్‌లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారు ఆనందంగా ఉండటం చూసి బిగ్‌బాస్ తట్టుకోలేకపోయాడు. ఈ పోటీకి ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది, ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్‌బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడారు.

ఇదంతా ఓ ఎత్తయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈమెని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు. హౌస్‌లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా మిగతా లేడీ హౌస్‌మేట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఈ విషయం ఎలిమినేట్ అయిన తరువాత సోనియా నాగార్జునతో బాహటంగానే అందరిముందు చెప్పింది. కండబలం వున్నవారికి గుండెబలం తక్కువుంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్.

(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్)

సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‪‌లోనే బలవంతుడైన నిఖిల్. ఇతడితో పాటు పృథ్వీ కూడా అదే తీరు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించాడు. వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందని అన్నాడు.

హౌస్‌లో ఉన్నవాళ్ళ నుంచి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఇంకొంతమందిని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్‌బాస్. ఏదేమైనప్పటికీ అటు బిగ్‌బాస్ ఇటు తెలుగు ప్రేక్షకులు ఒకింత సమానంగా ఆలోచిస్తారనుకోవచ్చేమో ఆలోచించండి.

-ఇంటూరి హరికృష్ణ

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement