ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.
టాలీవుడ్‌లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. అందుకే ఫ్యాన్స్ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది.


