నాకేదైనా అయితే ఆ ఐదుగురే కారణం.. వీడియోలున్నాయ్‌! | Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Sensational Comments Before Arrest - Sakshi
Sakshi News home page

Pallavi Prashanth Arrest: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!

Published Thu, Dec 21 2023 11:23 AM

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Sensational Comments Before Arrest - Sakshi

ఒక కామన్‌ మ్యాన్‌ అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు పల్లవి ప్రశాంత్‌. రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మెదులుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు. అంతిమంగా అందరినీ వెనక్కు నెట్టి బిగ్‌బాస్‌ 7 టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. కానీ ఈ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది.

పోలీసుల మాటలు బేఖాతరు
శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్‌ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమన్నారు పోలీసులు. ఇతడు మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రశాంత్‌ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కావాలనే నెగెటివ్‌ చేస్తున్నారు
అయితే తాను అరెస్ట్‌ అవడానికి ముందు ప్రశాంత్‌.. అసలేం జరిగిందనేదానిపై వివరణ ఇస్తూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్‌ మాట్లాడుతూ.. 'నాకు సరిగా తిండీ నిద్ర లేదు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిన. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్లు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురైదుగురి ఫోటోలు, వీడియోలు మావాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగెటివ్‌ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత!

పోలీసులు చెప్పారు, కానీ..
బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్‌ అయిన. నాకు ఇంతమంది సపోర్ట్‌ చేశారా? అనుకున్నాను. పోలీసులు వెనుక గేట్‌ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు.. నేను దొంగలాగా వెనుక నుంచి వెళ్లను.. ముందు గేట్‌ నుంచే వెళ్తానని చెప్పాను. వాళ్లు ఇంకా ఏమని చెప్పారో ఆ రణగొణ ధ్వనుల మధ్య నాకు వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు.. కానీ అప్పుడు నాకు ఏదీ సరిగా వినబడకపోవడంతో అలాగే ముందుకు వెళ్లాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నాకేదైనా అయినా, నా ఇంట్లోవాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి' అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్‌.

చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్‌.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే

Advertisement
 
Advertisement
 
Advertisement