
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)ను విజయవంతంగా ముందుకు నడిపించడంలో హోస్ట్‌దే ప్రధాన పాత్ర! కంటెస్టెంట్లను వాయించడానికి, తప్పొప్పులు చెప్పడానికి, సరిదిద్దడానికి హోస్ట్ వీకెండ్‌లో రెండుసార్లు వస్తూ ఉంటాడు. షో చప్పగా ఉంటే దాన్ని రంజుగా మారుస్తాడు, ఊపు మీదంటే మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎటొచ్చీ గేమ్‌ను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా ట్రై చేస్తాడు.
15 ఏళ్లుగా హోస్టింగ్
అయితే సినిమాలు చేసే స్టార్లు టీవీ షోలలో హోస్ట్‌గా కనిపించాలంటే అంత ఈజీ కాదు. వారు అడిగిన రేంజులో డబ్బు ఇచ్చుకుంటేనే బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమవుతారు. తెలుగులో మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని బిగ్‌బాస్ షోకి హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత అంటే మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హిందీలో మొదట అర్షద్ వార్సీ, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు సెలబ్రిటీలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
వచ్చే నెలలోనే ప్రారంభం
నాలుగో సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ షోను తన భుజాలపై ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఆగస్టు 30న హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సల్మాన్.. ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. అయితే హీరో ఈసారి తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నాడట! కారణం గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ 19వ సీజన్‌కు పెద్దగా బడ్జెట్ కేటాయించలేదని తెలుస్తోంది.
పారితోషికంలో రూ.100 కోట్ల కోత!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం సల్లూ భాయ్ వీకెండ్‌కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం అందుకోవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పుకోవాలి!
ఓటీటీకే ప్రాధాన్యత
బిగ్‌బాస్ 19వ సీజన్‌లో ఓటీటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. హాట్‌స్టార్‌లో ఎపిసోడ్ రిలీజ్ చేసిన గంట- గంటన్నర తర్వాతే టీవీలో ప్రసారం కానుందట! అలాగే ఈ సీజన్ ఐదు నెలలు కొనసాగుతుందని, మొదటి మూడు నెలలు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తే తర్వాత ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి వారు చివరి రెండు నెలలు షో బాధ్యతలు అందుకోనున్నారని భోగట్టా! మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.
చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)