
‘‘బేబి’ చిత్రం కోసం టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పని చేశాం. మా చిత్రం జాతీయ అవార్డు గెల్చుకోవడం ఆనందంగా ఉంది. నా సినిమా ‘పోస్టర్ మీద నేషనల్ అవార్డ్ విన్నర్ అనే పేరు చూడటంతో నా కల నెరవేరిన అనుభూతి కలుగుతోంది’’ అని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బేబి’. ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రం 2023 జూలై 13న విడుదలైంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డ్స్‌లో ఈ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా పీవీఎన్‌ఎస్ రోహిత్ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సాయి రాజేశ్ మాట్లాడుతూ– ‘‘బేబి’ సినిమాకు ప్రతి ఒక్కరూ హీరోనే... అంతా ప్రాణం పెట్టి పని చేశారు. మాకు వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ మా ఎడిటర్ విప్లవ్‌గారికి కూడా చెందాలి. నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్‌కేఎన్ నమ్మినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు.
‘‘బేబి’లో ‘ప్రేమిస్తున్నా...’ పాటకి బెస్ట్ సింగర్‌గా జాతీయ అవార్డు అందుకోనుండటం సంతోషంగా ఉంది’’ అని పీవీఎన్‌ఎస్ రోహిత్ పేర్కొన్నారు. ‘‘బేబి’లో నేనూ భాగమైనందుకు చాలా హ్యాపీ’’ అన్నారు వైష్ణవీ చైతన్య. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ– ‘‘బేబి’కి జాతీయ అవార్డులు రావడంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత మాపై పెరిగింది’’ అని చెప్పారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని, ఎడిటర్ విప్లవ్, లిరిక్ రైటర్ సురేష్ బనిశెట్టి మాట్లాడారు.