
తండ్రిగా, విలన్‌గా, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్‌గా.. తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న ఆయన జూలై 13న ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన నటుడు బాబూమోహన్.. కోటగారు ఇక లేరన్న విషాదాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
చివరిరోజుల్లో తీవ్రబాధ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబూ మోహన్ (Babu Mohan) మాట్లాడుతూ.. ఇద్దరం ఆర్టిస్టులమే అయినా మాకు తెలియకుండానే అన్నదమ్ములమైపోయాం. ఏరా, ఎక్కడున్నావ్? వారమైంది, ఒకసారి రారా అని పిలిచేవారు. అవును, వెళ్లి చూడాలనుకునేవాడిని. కానీ ఇప్పుడా బంధం తెగిపోయింది. పాపం, కోటన్న చివరి రోజుల్లో కాలి నొప్పితో బాధపడ్డాడు. బాత్రూమ్‌లో కాలి జారి కిందపడటం.. నొప్పి ఉన్న కాలికే మళ్లీ గాయం కావడంతో చాలా ఇబ్బందిపడ్డాడు. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. రెండు, మూడు సంవత్సరాల నుంచి అదే గోస.

అలాంటి మరణమే నాకూ రావాలి
ఒక విషయంలో మాత్రం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా మంచానపడి, సపర్యలు ఎంతకాలం చేయాలని ఇంట్లోవాళ్లే అసహ్యించుకునే స్థాయికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్లనివ్వలేదు. కోటన్న నిద్రలోనే కన్నుమూశాడు. అలాంటి చావే నాకూ కావాలి. నీలాంటి మరణమే నాకూ ఇవ్వమని ఆ దేవుడికి చెప్పమని కోటన్నను వేడుకుంటున్నాను. మా ప్రయాణం ఎలా మొదలైందంటే.. బొబ్బిలి రాజా మూవీతో మా కాంబినేషన్ మొదలైంది. మామగారు చిత్రంతో బాగా ఫ్రెండ్సయ్యాం.
చనిపోవడానికి ఒకరోజు ముందే..
సెట్‌లో నాకు గోరుముద్దలు తినిపించేవాడు. అన్న చనిపోవడానికి ఒకరోజు ముందే ఫోన్ చేసి మాట్లాడాను. షూటింగ్ మొదలైంది, మళ్లీ చేస్తానని కాసేపాగి కాల్ చేశా.. అప్పుడు అన్న నిద్రపోయాడని చెప్పారు. సరే, మళ్లీ నిద్రలేచాక ఫోన్ చేయమన్నాను. తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కోటన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ బాబూ మోహన్ ఏడ్చేశాడు.
చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో!