‘ఇండస్ట్రీలో అవమానాలు కామన్.ఎదిగే క్రమంలో కొందరు కిందకు లాగాలని చూస్తుంటారు.అవన్నీ పట్టించుకోకుండా.. పనిపై శ్రద్ధ పెడితేనే సక్సెస్ ఉంటుంది’ అంటున్నాడు ప్రముఖ సినీ దర్శకుడు జయశంకర్(Jaya Shanker). పేపర్ బాయ్ లాంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా ‘అరి’(Ari )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జయశంకర్. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని అరిషడ్వార్గాల కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 10న, యూఎస్‌ఏలో నవంబర్ 14న రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన కెరీర్‌కు సబంధించి పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు.
‘పేపర్ బాయ్’ కంటే ముందు పలు చిత్రాలకు గోస్ట్ రైటర్‌గా పని చేసిన ఆయన...తన టాలెంట్‌తో సంపత్ నందిని మెప్పించి..తక్కువ సమయంలోనే దర్శకుడిగా మారాడు. అయితే కెరీర్‌లో ప్రారంభంలో అందరిలాగే తాను కూడా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడట. ‘చిత్ర పరిశ్రమలో విజయం సాధించాలంటే టాలెంట్‌తో పాటు ఓపిక కూడా ఉండాలి. మనం ఎదిగే క్రమంలో చాలా అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కెరీర్ ప్రారంభంలో ఒక టాప్ డైరెక్టర్ టీమ్‌లో పని చేశాను. ఓ సినిమా కోసం డైలాగులు రాస్తే..‘ఇవేం డైలాగులు..ఇలా ఉంటాయా?’ అని అందరి ముందే తిట్టాడు.
ఆయన అవమానించినా..నేను మాత్రం అది చాలెంజ్‌గానే తీసుకున్నాను. నా బలం ఏంటో నాకు తెలుసు. ఆయన తిట్టాడని నా శైలీని వీడలేదు. సంపత్‌నంది దర్శకత్వం వహించిన ‘గౌతమ్ నంద’ సినిమాకు నా శైలీలోనే డైలాగులు రాస్తే.. థియేటర్స్‌లో ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. పేపర్ బాయ్, అరి సినిమాల్లోని డైలాగ్స్‌పై కూడా చాలా మంది ప్రశంసించారు. నన్ను అవమానించిన ఆ టాప్ డైరెక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీకే దూరం అయ్యాడు. అందుకే ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా అని కాకుండా మన మనసు నచ్చిన కథని అనుకున్నట్లుగా తెరపై చూపిస్తే.. అది కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని జయశంకర్ అన్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. ‘అరి’ మాదిరే ఇది కూడా ఓ డిఫరెంట్ సబ్జెక్ అని చెప్పాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


