
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ రిలీజ్‌కు ముందే వివాదానికి దారితీసింది. సినిమా టైటిల్‌లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. ఆ తర్వాత జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పేరును మార్చారు. దీంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు ఓకే చెప్పింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.
కోర్టు రూమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రిలీజైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా.. ఆగస్టు 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..
సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఆమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకికి న్యాయం దక్కిందా లేదా అనేదే అసలు స్టోరీ.