‘జాతిరత్నాలు’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనుదీప్ కేవీ. తనదైన కామెడీ టైమింగ్, చమత్కారమైన మాటలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కంటే ఆయన మాట్లాడే మాటలకు అభిమానులు ఎక్కువనే చెప్పాలి. అలాంటి అనుదీప్ ఇప్పుడు మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తన ఆలోచనలు, మాటలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
(ఇదీ చదవండి: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించారు: దిల్ రాజు )
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించి అమెజాన్‌లో అందుబాటులో ఉంచారు. ఈ విషయాన్ని ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మన జాతిరత్నం ఓ పుస్తకం రాశారు’ అంటూ అనుదీప్ ఆ పుస్తకంతో ఉన్న ఫొటోను పంచుకున్నారు.
ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటారు
అయితే ఈ పుస్తకంపై అనుదీప్ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ‘ఈ పుస్తకం చదివాక ఏదో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటారు. లేదంటే రచయిత కంటే మీకే ఎక్కువ తెలుసని సంతోషపడతారు’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. దీంతో అనుదీప్ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.



