
ప్రతి ఆదివారం జుహులో తన ఇంటి ముంగిటకు వచ్చే అభిమానులను పలకరించే దశాబ్దాల సంప్రదాయానికి పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులను పలకరించిన తరువాత తన బ్లాగులో ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, కొన్ని సందేశాలను కూడా పంచుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే అదే విధంగా ఆయన తాజాగా కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో భావోద్వేగ భరిత సందేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటి కన్నా అందరినీ ఆకట్టుకుంది 1975 నాటి భారతీయ సంచలనం... క్లాసిక్ సినిమా ’షోలే’ సినిమా టిక్కెట్. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఈ టిక్కెట్‌ను అత్యంత జాగ్రత్తగా భధ్రపరచిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా దానిని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ టిక్కెట్ ధర కేవలం రూ. 20 మాత్రమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .
ఆయన తన పోస్ట్‌లో ‘‘‘’షోలే’ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరిచా... ఈ టిక్కెట్ అప్పుడు రూ. 20 !! ధర.. ఈ రోజుల్లో థియేటర్ హాళ్లలో ఎరేటెడ్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) ధర అదే నని నాకు చెప్పారు. అది నిజమా?? చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి కాదు.. ఆప్యాయత ప్రేమ,‘ అంటూ ఆయన ఆ పోస్ట్‌లో నర్మగర్భంగా రాశారు.
అయితే అమితాబ్ తన దగ్గరున్న ఈ టికెట్ ను పోస్ట్ చేయడం ఎంత ఆసక్తి కలిగించిందో నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందో.. అలాగే ఆయన రూ.20కి థియేటర్‌లో సాఫ్ట్ డ్రింక్ కొనవచ్చునని అనడం కూడా అంత చర్చకు దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతం ధియేటర్లలో రూ.20కి సాఫ్ట్ డ్రింక్ కొనే పరిస్థితి లేదు. రూ.100 ఆ పై ధరల్లో మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమితాబ్ రూ.20కే లభిస్తాయనడంతో... సెలబ్రిటీలకు ధరలపై ఉన్న అవగాహన చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల ధరలు అదే విధంగా తినుబండారాల ధరలకు సంబంధించిన సోషల్ చర్చకు కూడా బిగ్ బి పోస్ట్ దారి తీసింది.
మరోవైపు 1975లో విడుదలైన ‘షోలే‘, వచ్చే ఆగస్టు 15తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇందులో అమితాబ్‌తో పాటు ధర్మేంద్ర కూడా నటించారు ఈ సినిమా ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జై వీరు (అమితాబ్ మరియు ధర్మేంద్ర పోషించారు) అనే ఇద్దరు మాజీ ఖైదీల చుట్టూ తిరుగుతుంది, నటులు అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ మరియు హేమ మాలిని మరియు జయ బచ్చన్ ఈ చిత్రంలోని తారాగణాన్ని ముగించారు.