
కాస్త ఆలస్యంగా థియేటర్స్‌కు వస్తానంటున్నారు నార్త్ సర్దార్. అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్ 2’. ఈ చిత్రంలో పంజాబీ అమ్మాయిగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించారు. రవికిషన్, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. అజయ్ దేవగన్, జ్యోతిదేశ్ పాండే, ఎన్‌ఆర్ పచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మించారు. కాగా ఈ సినిమాను జూలై 25న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ వాయిదా వేశారు. ‘సన్నాఫ్ సర్దార్ 2’ సినిమా ఈ నెల 25న విడుదల కావడం లేదని, ఆగస్టు 1న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ వాయిదాకి కారణం ‘సయారా’ సినిమా. అహన్ పాండే, అనీత్ పద్దా హీరో హీరోయిన్లుగా నటించిన ‘సయారా’ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ సినిమాతో పోటీ ఎందుకని అజయ్ దేవగన్ తన సినిమాను ఆగస్టు 1కి వాయిదా వేసుకున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వంలో సునీల్ లీడ్ రోల్‌లో నటించిన హిట్ ఫిల్మ్ ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా రూపొందిన అజయ్ దేవగన్ ‘సన్నాఫ్ సర్దార్’ సినిమా 2012లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ రూపొందింది.