ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు.. తాము తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటామని చెబుతుంటారు. కానీ అవకాశాలు వస్తున్నా సరే వద్దని చెప్పి రిటైర్మెంట్ తీసుకునేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు సీనియర్ నటి తులసి అలాంటి షాకింగ్ ప్రకటన చేశారు. ఈ డిసెంబరు 31 తర్వాత తాను ఇకపై నటించనని అన్నారు. తర్వాత తన జీవితం సాయిబాబాకు అంకితం చేసేశానని ప్రకటించారు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.
తులసి.. మూడు నెలల వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చేశారు. తులసి తల్లి అలనాటి సావిత్రి స్నేహితురాలు. దీంతో 'జీవన తరంగాలు' అనే సినిమాలో ఊయలలో ఉండే పాపాయి పాత్ర కోసం తులసి తల్లిని అడిగారు. అలా తులసి.. తాను పుట్టిన 1967లో సినీ రంగ ప్రవేశం చేశారు.
(ఇదీ చదవండి: భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి)
నాలుగేళ్లు వచ్చిన తర్వాత నుంచి బాలనటిగా వరస సినిమాలు చేశారు. అలా తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో నటించింది. కన్నడ దర్శకుడు శివమణిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రలతో ఫేమ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోనూ ప్రభాస్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతో పాటు పలువురు స్టార్ హీరోయిన్లకు తల్లిగా నటించారు.
గత కొన్నాళ్ల నుంచి చాలా పరిమితంగా మూవీస్ చేస్తున్న తులసి.. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న సాయిబాబా దర్శనానికి వెళుతున్నానని, ఆ రోజే తన రిటైర్మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. తర్వాత సాయిబాబాకు సేవ చేసుకుంటూ బతికేస్తానని అన్నారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ నటి హేమ ఇంట్లో విషాదం)


