
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) ఏడాది జైలు శిక్ష విదిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, గతంలోనే ఆమెకు స్పెషల్ న్యాయస్థానం ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆమె ఆ సమయం నుంచే జైల్లోనే ఉన్నారు. విడుదల కాలేదు. దీంతో ఆమె తల్లి కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగలడమే కాకుండా ఏడాది పాటు జైలు శిక్ష విదిస్తూ న్యాయస్థానం ప్రకటించింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (కాఫిఫోసా చట్టం) కింద ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసులో ఆమెకు ఊరట లభించకపోవడంతో శిక్ష ఖరారు అయింది.
దుబాయ్ నుంచి బంగారాన్ని రన్యారావు అక్రమంగా తరలిస్తూ ఈ ఏడాది మార్చిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆమె వద్ద 14.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఆపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ సిండ్‌కేట్‌లో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించింది. అయితే, DRI అధికారుల విధానపరమైన లోపాల కారణంగా ఆమె ప్రారంభంలో డిఫాల్ట్ బెయిల్ పొందినప్పటికీ కాఫిఫోసా చట్టం వల్ల విడుదల కాలేదు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆమెకు చెందిన రూ.34 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
