
‘‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu)లో పంచమి పాత్ర చేశాను. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. ఈ పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య నా దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు’’ అని నిధీ అగర్వాల్ తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధీ అగర్వాల్(Nidhi Agarwal ) కథానాయికగా నటించారు. ఏఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో నిధీ అగర్వాల్ పంచుకున్న విశేషాలు.
→ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ‘హరిహర వీరమల్లు’ కథ రాశారు. పవన్ కల్యాణ్‌గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ‘ఇండియానా జోన్స్’ సినిమాకి ఇండియన్ వెర్షన్‌లా మా చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో భరతనాట్యం నేపథ్యంలో ఒక సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ నాకు సవాల్‌గా అనిపించింది.
→ భారీ సినిమా, పవన్ కల్యాణ్‌గారితో నటించే చాన్స్... పైగా ఏఎం రత్నంగారిలాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. అందుకే ఆలోచించకుండా ఈ సినిమాకి ఓకే చెప్పాను. ఇంత గొప్ప సినిమాలో పంచమి వంటి శక్తివంతమైన పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
→ క్రిష్‌గారు పంచమి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. అలాగే జ్యోతికృష్ణగారు సరైన సమయానికి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు ప్రత్యేకమే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమా ఏదీ చేయకూడదన్నది అగ్రిమెంట్. అందుకే ఈ చిత్రం కోసం ఐదేళ్లు కేటాయించాను. అయితే ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు రాలేదు. ఎందుకంటే నెలకు కనీసం ఒక షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికైనా వెళ్లేదాన్ని. ఐదేళ్లు ఆగినప్పటికీ ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నా కష్టానికి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.
→ ఇకపై ‘హరిహర వీరమల్లు’ సినిమాలా ఏ చిత్రానికీ అగ్రిమెంట్ చేసుకోను. అదే విధంగా ఎక్కువ సీజీ వర్క్స్ ఉన్న సినిమాలు చేయను. రెండు మూడు నెలల్లో షూటింగ్ అయిపోయి, ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయ్యే సినిమాలే చేస్తాను.
→‘హరిహర వీరమల్లు’ చిత్రంలో పవన్ కల్యాణ్‌గారితో, ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్‌గారితో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతి. ఎంత పెద్ద స్టార్స్ అయినా ఎంతో వినయంగా ఉన్నారు. పవన్‌గారు పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. అలాగే ప్రభాస్‌గారు మనసున్న మంచి మనిషి. అందరూ అంటున్నట్లు ఆయన నిజంగానే డార్లింగ్.