ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది)
కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' అనే వెబ్ సిరీస్‌లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.
'సిరీస్ కోసం అగ్రిమెంట్‌పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు'
'ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.
(ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి)


