అందాల నటికి ఆఫర్... తిరస్కరించినట్టు వెల్లడి
కోట్లు ఉంటే చాలు కొండ మీది కోతిని కూడా కిందకు దిగొస్తుంది అని సంపన్నులతో పాటు చాలా మంది నమ్మకం. అయితే కోతి అయినా వస్తుందేమో గానీ, ఆత్మవిశ్వాసం ఉన్న అందమైన అమ్మాయి మాత్రం రాదని ఓ యువతి నిరూపించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆస్తి, భూమి ఐదు అంకెల నెలవారీ భత్యంతో పాటు మరెన్నో అద్భుతమైన విలాసాలను ఆశ చూపించినప్పటికీ... ఆమె ఒప్పుకోలేదు.
ఆమె పేరు అమీ నూర్ టినీ( Amy Nur Tinie). ఈ 29 ఏళ్ల మలేషియా నటి మాజీ అందాల రాణి కూడా. ఆమె ఇటీవల మలేషియా కంటెంట్ క్రియేటర్ సఫ్వాన్ నజ్రీ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఈ ప్రతిపాదన తమ దేశానికే చెందిన ఓ పెద్ద వివిఐపి నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. మలేషియాలో సాధారణంగా చాలా ఉన్నత సామాజిక ఆర్థిక హోదా కలిగిన వ్యక్తులను వివిఐపీలుగా అభివర్ణిస్తారు.
కార్పొరేట్ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నప్పుడు తాను తరచుగా అలాంటి వివిఐపిలను కలుస్తుండడం జరుగుతుందని, ఆ సమయంలో వారిలో చాలామంది తన ఫోన్ నంబర్ అడగడం సర్వసాధారణం అని తెలిపింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని కూడా ఆహ్వానిస్తారని అమీ వివరించింది. అదే విధంగా ఒక వ్యక్తి తనను కలిశాడని, నేరుగా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడని గుర్తు చేసుకుంది. ఆ వ్యక్తి ప్రపోజల్‌ను అంగీకరిస్తే ఆమెకు ఒక బంగ్లా, కారు, 10 ఎకరాల (40,000 చదరపు మీటర్లు) భూమి, 50,000 రింగిట్స్ (సుమారు రూ.11 లక్షలు) నెలవారీ భత్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని తెలిపింది.
ప్రస్తుతం మలేషియాలో ఈ పాడ్ కాస్ట్ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నవారు గతంలో ఇదే నటి ఇచ్చిన మరో ఇంటర్వ్యూను వెలుగులోకి తెచ్చారు. అందులో మరింత వివరంగా ఆమె తాను అందుకున్న ప్రతిపాదనకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. దాని ప్రకారం... ఈ ప్రతిపాదన 2019లో జరిగిందని, ఆమె 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆఫర్ అందుకుందని తేలింది. ఆసమయంలో ఆమె అందాల పోటీలలో చురుకుగా పోటీ పడుతోందని వెల్లడైంది. ఆ వ్యక్తి ని డాతుక్ అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. అందాల పోటీలలో పాల్గొనడానికి నిధులు సమకూర్చడానికి కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌ల అవసరం ఏర్పడడంతో...ఆ విషయంలో దాతుక్ తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడని అయితే అతని ఆఫర్‌ను తాను వెంటనే తిరస్కరించినట్టు చెప్పింది.
సదరు వ్యక్తికి దాదాపు తన తండ్రి వయస్సు ఉంటుందని అంతే కాకుండా అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా ఆయ్యాయని కూడా వివరించింది. అయితే తన తల్లి తనను అమ్మేయాలని అనుకోలేదని ఆమె చెప్పింది. ఇంకా అవివాహిత గానే ఉన్న అమీ...పాడ్‌కాస్ట్‌లో, తన జీవిత భాగస్వామిగా కాబోయేవాడు బాధ్యతాయుతంగా ఆర్థికంగా స్థిరపడి ఉంటే చాలని మరీ విపరీతమైన సంపద అవసరం లేదని చెప్పారు. ఆ ఆఫర్ ని అంగీకరించి ఉంటే తన జీవితం మరింత సుఖంగా ఉండి ఉండేదని ఆమె అంగీకరించింది, కానీ అది తాను కోరుకున్న జీవన మార్గం కాదని చెప్పింది.


