
శాండల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యపై అశ్లీల సందేశాలు పోస్టు చేసిన కేసుల్లో 13 మందిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులపై నగర సైబర్ క్రైం స్టేషన్ సిబ్బంది సీరియస్‌గా పని చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సందేశాలు పంపే వ్యక్తులపై చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బళ్లారి, చిత్రదుర్గ, బెంగళూరు, కోలారు జిల్లాల పరిధిలో 50 అకౌంట్లపై నిఘా ఉంచిన్నట్లు తెలిపారు.
బెంగళూరు చుట్టుపక్కల నుంచి అనేక మంది కామెంట్లు చేసినట్లు గుర్తించారు. బళ్లారికి చెందిన ఒకరు, చిత్రదుర్గకు చెందిన మరొకరితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తునట్లు చెప్పారు. కాగా, తన ఫిర్యాదుపై స్పందించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు నటి రమ్య ధన్యవాదాలు తెలిపారు. రేణుకస్వామిని హత్య చేసి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడంటూ నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా రమ్య పలు వ్యాఖ్యలు చేశారు. మా హీరోనే విమర్శిస్తావా అంటూ దర్శన్ అభిమానులు ఆమెపై రెచ్చిపోయారు. ఏకంగా అత్యాచారం చేసి చంపేస్తామని మెసేజ్లు పంపారు. దీంతో ఆందోళన చెందిన ఆమె పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రమ్యకు శివణ్ణ మద్దతు
రమ్యపై చేసిన నీచమైన పోస్టులను ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ ఖండించారు. రమ్యకు ఆయన మద్దతు ప్రకటించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వారిని క్షమించలేమన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని మనవి చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారు.