
కాంతార ఛాప్టర్–1 చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రుక్మిణి వసంత్ కీలక పాత్రను పోషించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు సంపత్‌రామ్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా రాణిస్తున్నారు. సలార్, కన్నప్ప, డాకు మహరాజ్, విక్రమ్, నారప్ప, తంగలాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. తమిళ్‌లో సుమారు 80కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. రిషబ్‌శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్‌తో పరిచయం కావడం ఆ నాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారు.

తాజాగా కన్నడంలో రూపొంది తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో అనువాదమై విడుదలైన కాంతార ఛాప్టర్–1 చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా నటించారు. దీనిపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా తక్కువ సన్నివేశాల్లో నటించినా చాలా సంతృప్తిగా ఉందన్నారు.
ఈ చిత్రంలో వైవిధ్యభరిత గెటప్‌లో కనిపిస్తాననీ, ఆ గెటప్ కోసం గంటన్నర పాటు మేకప్‌కు సమయం పట్టేదని, అదే విధంగా మేకప్ తీయడానికి గంటకు పైగా సమయం పట్టేదని చెప్పారు. అయినప్పటికీ మంచి విజయం సాధించిన చిత్రంలో నటించే అవకాశం రావడం భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నటుడు సంపత్‌రామ్ పేర్కొన్నారు.