మన్సూర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

Actor Mansoor Ali Khan Gets Advance Bail Over Remarks On COVID vaccine - Sakshi

 టీకాకు రూ.2లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం 

సాక్షి, చెన్నై: సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. టీకా కొనుగోలు నిమిత్తం రూ. రెండు లక్షలు ఆరోగ్య శాఖకు చెల్లించాలన్న నిబంధనతో ఈ బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడం గమనార్హం. కరోనా టీకా వేయించుకున్న హాస్య నటుడు వివేక్‌ ఆస్పత్రి పాలు కావడంతో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తీవ్ర ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేక్‌ మరణించడం వంటి పరిణామాలతో కరోనా టీకా విషయంగా మన్సూర్‌ తీవ్రంగానే స్పందించారు. దీంతో టీకాపై అనుమానాలు, ఆందోళనలు బయలుదేరాయి. చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి గట్టెక్కేందుకు తొలుత సెషన్స్‌ కోర్టును మన్సూర్‌ అలీఖాన్‌ ఆశ్రయించారు. అయితే, ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

టీకా కోసం...రూ. రెండు లక్షలు.. 
సెషన్స్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో మద్రాసు హైకోర్టును మన్సూర్‌ అలీఖాన్‌ ఆశ్రయించాల్సి వచ్చింది. గురువారం ఈ పిటిషన్‌ న్యాయమూర్తి దండపాణి నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చింది. మన్సూర్‌ తరఫు న్యాయవాది రాధాకృష్ణన్‌  వాదన వినిపిస్తూ, పథకం ప్రకారం లేదా, దురుద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  ఉద్వేగానికి లోనై ఆ వ్యా ఖ్యలు చేశారని, ఇందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్టు వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో టీకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. విజ్ఞానశాస్త్రంపై నమ్మకం ఉంచాలని, పరిశోధకులు, వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అంటూ కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. చివరకు మన్సూర్‌ అలీఖాన్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. అయితే, కరోనా టీకా కొనుగోలు నిమిత్తం ఆరోగ్యశాఖ కార్యదర్శిని కలిసి రూ. 2 లక్షలు అందజేయాలన్న నిబంధనను విధించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top