సకల సినీ పాత్రలకు పెట్టని కోట | Actor Kota Srinivasa Rao Passed Away: Tollywood Celebrities Condolences Over Kota Srinivasa Rao Death | Sakshi
Sakshi News home page

సకల సినీ పాత్రలకు పెట్టని కోట

Jul 14 2025 4:04 AM | Updated on Jul 14 2025 4:39 AM

Actor Kota Srinivasa Rao Passed Away: Tollywood Celebrities Condolences Over Kota Srinivasa Rao Death

నివాళి: ‘శివ’లో అతను మాచిరాజు ‘అతడు’లో బాజిరెడ్డి పవర్‌జోన్‌లో అలాంటివాడుంటాడు – కోటలాగా. ‘అహ నా పెళ్ళంట’లో భిక్షపతి ‘ఆమె’లో అంతకంటే పిసినారి ప్రతి వీధిలో ఉంటాడు – కోటలాగే. ‘భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ’... ‘మందుబాబులం మేము మందుబాబులం’... మిడిల్‌క్లాస్‌ పార్టీల్లో పెగ్గుపెగ్గుకొక కోట... ఆ సినిమాలో తండ్రి... ఈ సినిమాలో తాతా... ‘చెబాష్‌... చెబాష్‌... చెబాష్‌’  ఉత్సాహపరిచే బాబాయ్‌... తెలుగు తెరపై ఆల్‌రౌండర్‌ కోట. 1985 ‘ప్రతిఘటన’ నుంచి 2015 ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వరకు ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూనే ఉన్నాడు. దిగంతాలకేగినా నేలన మిగిలిపోయాడు.

కోట శ్రీనివాసరావు తన ముఖంతో కంటే ముందు తన మాటతో ప్రేక్షకులకు తెలిశారు.
అవును.
‘ప్రతిఘటన’ సూపర్‌ హిట్‌ అయ్యాక వెంటనే డైలాగులు మార్కెట్‌లోకి క్యాసెట్లుగా వచ్చేశాయి. అప్పటికి ఆ సినిమా చాలా ఊళ్లకు వెళ్లనే లేదు. ఈలోపు క్యాసెట్లలో డైలాగులు వినసాగారు జనం. అందులో తెలంగాణ భాషలో పాత్ర మాట్లాడే ఒక పాత్ర వారిని ఆశ్చర్యపరిచి కొత్తగా అనిపించింది. మూసకట్టు తెలుగు సినిమాల్లో తెలంగాణ మాటను ఆ మాత్రమైనా పలికించినవారు అప్పటి వరకూ లేరు. ఏదడిగినా ‘పైకమిటీని అడిగి జె΄్తా’ అనే పాత్ర ఆ నటుడికి జన సామాన్యంలో మొదటిసారి గుర్తింపు తెచ్చింది. అందరూ ఆ నటుడిది తెలంగాణ అయి ఉంటుందని అనుకున్నారు. కాదు... కంకి పాడు.
∙∙ 
చిరంజీవి, కోట శ్రీనివాసరావు ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 
ప్రాణం ఖరీదు’. 1978. 
కాని 1985 వరకూ కోటకు మళ్లీ సినిమాలు చేసే వీలు రాలేదు. బ్యాంకు ఉద్యోగమూ... బాధ్యతలూ... నాటకాలూ. అయితే నాటకాలు వేసే వారు సినీ దర్శకుల కంట పడటం సులభం. క్రాంతి కుమార్, టి. కృష్ణ, జంధ్యాల అలా అవకాశాలు ఇచ్చినవారే. టి. కృష్ణ ‘ప్రతిఘటన’లో రాజకీయ నాయకుడి వేషం వేయిస్తే ‘బాబాయ్‌ అబ్బాయ్‌’లో అప్పులిచ్చి బాలకృష్ణ, సుత్తి వీరభద్రరావుల వెంటపడే గ్యాంగులో ఒకడిగా చూపించారు జంధ్యాల.

అయితే సినిమాలో కోటకు ఆ అప్పు తిరిగి రాకపోగా పులి మీద పుట్రలా నిర్మలమ్మ మనవరాలైన పావలా శ్యామల పెళ్లి చేసుకోమని వెంటపడుతుంటుంది.  రెండు పాత్రలూ నవ్వించేవే. అందుకే ‘అహ నా పెళ్ళంట’లో పిసినారి పాత్రకు కోట గుర్తుకు వచ్చారు రామానాయుడుకు. వాస్తవానికి ఆ పాత్ర రావు గో పాలరావు వేయాలి. కోటకు రాసిపెట్టి ఉంది. ‘నాకేంటి’ అని కోట ప్రేక్షకులను చూస్తూ అరచేతిలో అరచేతితో తాళం వేస్తే ప్రేక్షకులు ఎంతెంత ఇచ్చారనీ. ఇప్పటి వరకూ... ఇకపైనా.. అభిమానం!

∙∙ 
కోటది నాగభూషణం స్కూలు. సీరియస్‌ విలన్‌లుగా రాణించిన కైకాల, రావు గో పాలరావుల అంశ కోటలో ఉన్నా కోట ఎప్పటికీ వారిలా సీరియస్‌ విలన్‌గా పండలేదు. కామెడీ టచ్‌ ఉంటే చెలరేగుతారు. నాగభూషణం కూడా అంతే. అందుకే కోటలో నాగభూషణం మేనరిజమ్స్‌ కనిపిస్తాయి. నాగభూషణాన్ని ఇన్‌స్పయిర్‌ చేసిన తమిళ నటుడు ఎం.ఆర్‌. రాధ బాడీ లాంగ్వేజ్‌ మాట విరుపు కూడా కోటలో ఉన్నాయి. మాటను నెమ్మది చేసి పెంచడం ఎం.ఆర్‌. రాధ స్టయిల్‌. నాన్‌ సీరియస్‌గా కనిపించే సీరియస్‌ విలన్‌. ‘శత్రువు’లో కోడి రామకృష్ణ కోటను సీరియస్‌ విలన్‌గానే చూపిద్దామనుకున్నారు. కాని ‘ఈ హోటల్‌లో జల పాతాలు ఎవరు పెట్టార్రా బాబూ’... అని చేతులు నెత్తి మీద వేసుకుంటే ప్రేక్షకులు భయపడుతూనే నవ్వారు. ‘థ్యాంక్స్‌’ అనే అతని మేనరిజమ్‌ని ఫాలో అయ్యారు. 

∙∙ 
తమిళంలో గౌండర్‌ మణి, సెంథిల్‌ ద్వయం చేస్తున్న కామెడీకి తెలుగు రిప్లికాగా కోట, బాబూ మోహన్‌ తయారు కావడం సినిమాల సక్సెస్‌కు కారణమైంది. ‘మామగారు’ (1990)లో మొదలైన ఈ కామెడీ దాదాపు పదేళ్లు ఒక ఊపు ఊపింది. కోట సెట్స్‌ మీద మాటలు పేల్చడంలో ఘనులు. ‘కథలు లేక తెలుగు సినిమా కదల్లేకపోతోంది’ అనేవారాయన. కథలు లేక వరుసపెట్టి సాగిన తమిళ రీమేకుల్లో కోటకు పాత్రలు దొరుకుతూ వెళ్లాయి.

అంతే కాదు ఆయన తన అద్భుతమైన టైమింగ్‌తో గౌండర్‌ మణి, మణివణ్ణన్, రాధా రవి... తదితరుల పాత్రలకు డబ్బింగ్‌ చెప్పి సినిమాలు హిట్‌ కావడానికి కారకులు అయ్యారు. ‘ఒకే ఒక్కడు’, ‘ప్రేమలేఖ’ సినిమాల్లో మణివణ్ణన్‌కు కోట డబ్బింగ్‌ చెప్పిన తీరు ఆ రంగంలో కృషి చేసేవారు తప్పక పరిశీలించదగ్గది.

∙∙ 
దర్శకులే ఆర్టిస్టులను తయారు చేస్తారు. కోటకు ఆ సంగతి తెలుసు. నేను డైరెక్టర్ల ఆర్టిస్టును అని అంగీకరించేవారు. కోట కెరీర్‌లో ఇద్దరు ముగ్గురు దర్శకులు చాలా ముఖ్య పాత్ర పోషించారు. జంధ్యాల ఎలాగూ సరే. కాని జంధ్యాల శిష్యుడుగా రంగప్రవేశం చేసిన ఇ.వి.వి. సత్యనారాయణ కోటను తన సినిమాలకు ముఖ్య బలంగా చేసుకున్నారు. ‘సీతారత్నంగారి అబ్బాయి’తో మొదలైన ఈ కాంబినేషన్‌ ఇ.వి.వి. చివరి సినిమా వరకూ కొనసాగింది. ‘420’లో కోటతో చేయించిన ఎస్‌.ఐ. పాత్రను ‘హలో బ్రదర్‌’లో రిపీట్‌ చేసి ఎస్‌.ఐ. తాడి మట్టయ్య పాత్రను గుర్తుండిపోయేలా చేశారు.

ఇ.వి.వియే కోటను వెంకటేశ్‌కు తండ్రిలా చూపించే సాహసం చేసి ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ను సూపర్‌ హిట్‌ చేశారు. కోట ఆ పాత్రను అలవోకగా నమిలేశారు. ఇ.వి.వి.యే కోటను ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో తాత పాత్రకు ప్రమోట్‌ చేశారు. ఇక ‘జంబలకిడి పంబ’లో కోటను ఎవరు మరువగలరు? షాట్‌ మొదలుకావడమే తలకు తుండు ముడి వేసి తులసికోట చుట్టూ తిరుగుతుంటారు.

ఇక కోట.. బ్రహ్మానందంల మధ్య సాగే లాంఛనాల డైలాగులు అందరికీ కంఠో పాఠమే. కోట అడిగిన మగపడుచు లాంఛనాలకు బ్రహ్మానందం జవాబు ‘అర్ధ నూట పదహార్లు... రెండు జబ్బల బనీన్లు. ఒక కరీం బీడీ కట్ట’....
ఇ.వి.వితో సమాంతరంగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి కూడా కోటకు వరుసగా పాత్రలు ఇస్తూ వెళ్లారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘శుభలగ్నం’, ‘మాయలోడు’... ఇక ‘వినోదం’ సినిమా కోట చుట్టూనే తిరుగుతూ వినోదాన్ని పంచింది.

∙∙ 
‘హోల్డర్‌లో దూరడం ముఖ్యం కాదు... స్విచ్‌ వేస్తే వెలగాలి’... అని కోట తరచూ చెప్పేమాట. అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీలో తిరిగేవారు తమలో ఎంత ప్రతిభ ఉందో గుర్తెరిగి ప్రయత్నించాలని అనేవారాయన. రికమండేషన్లు పాత్ర పట్టడానికి పనికి వస్తాయి గాని కెమెరా ముందు రికమండేషన్లు పని చేయవు. స్వయంగా వెలగాల్సిందే. ఆ వంకన చూస్తే మొదలు నుంచి తుది వరకు కోట స్విచ్‌ వేసిన ప్రతిసారి వెలుగుతూనే ఉన్నారు. ఒకో సందర్భంలో ఒకో పాత్ర... ఒకో మెరుపు. ‘గాయం’ సినిమాలో రేవతి ‘మీరేమంటారు?’ అనడిగితే ‘ఖండిస్తున్నాం’ అంటాడు కోట.

చిన్న సీన్‌. పెద్ద హిట్‌. ‘మనీ’ సినిమాలో శుభలేఖ ఇస్తే ఇచ్చినవాడి మీద జాలిపడుతూ ‘కార్డ్‌ ప్రింటెడ్‌’ అంటూ పలికించిన కామెడీ బ్యాచిలర్‌ పార్టీలలో నేటికీ వినపడుతూనే ఉంటుంది. ‘సంతోషం’ సినిమాలో హింసరాజుగా ఒకటి రెండు సీన్లు... భలే. ఈ కోటే ‘గణేశ్‌’ సినిమాలో అత్యంత భయంకరమైన విలనీని ప్రదర్శించారు. కోట విలన్‌గా చేసిన పాత్రల్లో ఇది వేసినంత గట్టి ముద్ర మరొకటి వేయలేదు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో ‘ఎన్టీవోడు గద పిసుకుతుండు’ అని బ్రహ్మానందం ్ర పాణం తీస్తాడు పటేల్‌ పాత్రలో ఉన్న కోట.

ఇక వంశీ తీసిన ‘శ్రీ కనక మహాలక్ష్మి డాన్స్‌ట్రూప్‌’లో హీరోయిన్‌ని నాటకాలకు పంపమని నిర్మలమ్మను అడిగేందుకు కోట వెళ్లి ‘లవకుశ’ సినిమాలోని పాట పాడటం, నిర్మలమ్మ చీపిరి తిరగేయడం మరో భాషలో మరో నటుడి మీద కుదరని కామెడీ. ఇలా నవ్వించిన కోట ‘లిటిల్‌ సోల్జర్స్‌’లో చాలా సీరియస్‌గా ఉండే మేజర్‌గా కనిపించడం, పిల్లలకు ధైర్యం ఇవ్వడం మరువగలమా? ‘ఆ నలుగురు’, ‘ఫ్యామిలీ సర్కస్‌’, ‘నా ఎదవతనం ముందు నీ ఎదవతనం ఎంత’ అని కొడుకు శ్రీహరిని ఊరడించే తండ్రిగా ‘బావగారూ... బాగున్నారా’, ‘అన్నయ్య’లో సీనియర్‌ లారీ క్లీనర్‌గా ‘చెబాష్‌ చెబాష్‌ చెబాష్‌’ అనే మేనరిజమ్‌ కోటను పదే పదే గుర్తు చేసేవే. ‘సడక్‌’లో సదాశివ్‌ అద్భుతంగా చేసిన హిజ్రా పాత్రను ‘రెండిళ్ల పూజారి’లో కోట అంతే అద్భుతంగా చేయగలిగారు. కెరీర్‌ పీక్‌లో ఉండగా అలాంటి పాత్ర చేయడం రిస్క్‌. దానిని దాటారు కోట.
ఈ కోట శ్రీనివాసరావే కొడుకు మీద లోలోన ఎంతో ప్రేమ పెట్టుకుని పైకి కఠినంగా ఉండే తండ్రిగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ఎంత బాగా నటించారు!

∙∙ 
కోట అసలు సిసలు తెలుగు నటుడు. ఆయన ఇతర భాషల్లో హిట్‌ అయినా ఆయన ముఖం, మాట, నటన, నడక అన్నీ తెలుగువే. అందుకే ఆయన పరాయి భాష నటుల మీద ఒకోసారి నిరసన చూపినా... లోకల్‌ టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వాలని 2003 ్ర పాంతంలో హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు కూచున్నా తెలుగు మమకారమే కారణం. ‘మండలాధీశుడు’ సినిమాలో నటించడం వల్ల చాలా కాలం ఆయన ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే యాక్సిడెంట్‌లో కుమారుణ్ణిపోగొట్టుకుని పుట్టెడు దుఃఖం మూటగట్టుకున్నారు. వయసు, డయాబెటిస్‌ ఆయనను ఇంటికే పరిమితం చేశాయిగానీ ఆయన తన మాటను వెలిగిస్తూనే వెళ్లారు.

‘శ్రీమతితో, షుగర్‌తో జాగ్రత్తగా ఉండాలి. శ్రీమతిని బాగా చూసుకోకపోతే ఆమె వెళ్లిపోతుంది. షుగర్‌ను బాగా చూసుకోకపోతే మనం వెళ్లిపోతాం’ అని జోక్‌ చేసేవారాయన.
రామ్‌గో పాల్‌ వర్మ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి అతి కొద్ది మంది దర్శకులు ఆయనలోని భిన్నమైన నటుణ్ణి వెలికి తీసే పాత్రలు ఇచ్చారు. కోట చాలా గొప్పగా చాలా పాత్రలు చేసినా ఆయనకు చాలెంజ్‌ విసిరే పాత్రలు ఇంకా దొరకాల్సింది. కోట వంటి ఆల్‌రౌండర్‌ నటుడు అరుదు. ఆ మేలిమి నటుడికి నివాళి.
– కె.

‘అహ నా పెళ్ళంట’లో కోట న్యూస్‌పేపర్‌ను లుంగీలా కట్టుకోవడం, కోణ్ణి వేళాడగట్టి అదే చికెన్‌ కర్రీ అని ఉత్తన్నం తినేయడం, వర్షం రాకపోయినా, గేదె ఎక్కువ పాలివ్వకపోయినా బ్రహ్మానందం జీతంలో కోత విధించడం... బ్రహ్మానందం కోటను చూసి ‘వీడూ వీడి మొహమూనూ’ అని తిట్టుకుంటూ ఉంటే ‘ఆ మొహానికేమి మాకు నచ్చింది’ అని సాకారు ప్రేక్షకులు ముద్దుగా.

ప్రముఖుల నివాళి
కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడంతో పాటు కోట కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తం చేశారు.  

మా ఇద్దరి నటప్రస్థానం ప్రాణం ఖరీదు’ సినిమాతో ్ర పారంభమైంది. వ్యక్తిగతంగా ఆయన చేసే చమత్కారాలు, చెప్పే జోకులు కానీ... అవి ఉత్సాహపరుస్తాయి. షూటింగ్‌ ఉందంటే ఇవాళ కోటగారు ఉంటారు... బాగుంటుందనే ఉత్సాహంతో వెళ్లేవాళ్లం. ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చె΄్పాలి. అంతటి పరిపూర్ణమైన నటన. ఆయనలా విలక్షణమైన, వైవిధ్యమైన నటులు మళ్లీ వస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటి నటులు దొరకరేమో... ఉండరేమో కూడా.  – చిరంజీవి 

 ప్రియమైన కోట... మిమ్మల్ని ఇకపై చాలా మిస్‌ అవుతాము. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసును ఎప్పటికీ మర్చిపోలేము. మాటల్లో చెప్పలేని దుఃఖం కలుగుతోంది. – మంచు మోహన్‌బాబు
 
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలుపోషించిన కోట శ్రీనివాసరావుగారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సం పా దించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవంపోశారు. ఇతర భాషల్లోనూ నటించి, మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎమ్మెల్యేగా ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సం పాదించుకున్నారు.  
– నందమూరి బాలకృష్ణ

ప్రియమైన కోటగారు... ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మీ ప్రేమ, ఆ΄్యాయత, మీ చతురత, మీ ప్రతిభ భర్తీ చేయలేనివి. – నాగార్జున 

తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే విలక్షణ నటుడు. వ్యక్తిగతంగానూ నాకు నష్టమే. ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు, శత్రువు, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’... ఇలా ఎన్నో సినిమాలు చేశాం. మా సురేష్‌ ్ర΄÷డక్షన్స్‌లోని ప్రతి సినిమాలో కోటగారు చేసేవారు. మా నాన్నగారు డి. రామానాయుడు, నా సోదరుడు సురేష్‌బాబు, రానాలకూ కోటగారితో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. – వెంకటేశ్‌

 ఏ అభి్ర పాయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి కోటగారు. నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ‘అత్తారింటికి దారేది’... వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ‘అత్తారింటికి దారేది’ సినిమా సమయంలో మీరు కాస్త ఇబ్బంది పడుతున్నారంటే, కష్టాలను అధిగమించడానికి నటనే నాకు మరుపు అని చెప్పేవారు. ఆ మాట నన్ను చాలా కదిలించింది. ఎంతమంది గొప్ప నటులు ఉన్నా ఆయనది విశిష్టమైన శైలి. కోట శ్రీనివాసరావు – బాబుమోహన్‌గార్ల కాంబినేషన్‌ని మేం విపరీతంగా ఎంజాయ్‌ చేసేవాళ్లం.      – పవన్‌ కల్యాణ్‌

 కోట శ్రీనివాసరావుగారిని చూస్తూ, ఆరాధిస్తూ, ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబాయ్‌ మా ఫ్యామిలీ మెంబర్‌ లాంటివారు. ఆయనతో నేను కలిసి పని చేసిన క్షణాలు నాకు మంచి జ్ఞాపకాలు.        – రవితేజ  

 కోట శ్రీనివాసరావుగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన సినిమాలు చూస్తూ, ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగిన వారికి కోటగారు దూరం కావడం వ్యక్తిగత నష్టంలా అనిపిస్తుంది.         – మహేశ్‌బాబు 

 యాక్టింగ్‌ ఇండస్ట్రీకి, నటనకి నిలువెత్తు రూపం కోట  శ్రీనివాసరావుగారు. ఆయన ఒక్కరే. ఇంకో కోటాగారు మళ్లీ పుట్టరు... మళ్లీ రారు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే... ఈ రోజు మనకు ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకు మిగిల్చి వెళ్లినటువంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. లెట్స్‌ సెలబ్రేట్‌ కోటాగారు. అందరికీ నా విజ్ఞప్తి. ఆయన మనల్ని ఎంతగా రంజింప చేశారో ఆ అనుభూతులుంటాయి. ఆయన ఎక్కడున్నా ఆ చల్లని చూపు మనందరిపై ఉండాలని ఆ భగవంతుణ్ణి ్ర పార్థిస్తున్నాను.  
– ఎన్టీఆర్‌

 కోట శ్రీనివాసరావుగారిలాంటి విలక్షణ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. మన హృదయాల్లో నిలిచిపోయేలా, ఆయనపోషించిన అద్భుతమైన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి         – రామ్‌చరణ్‌

 కోట శ్రీనివాసరావుగారి గురించి హృదయ విదారక వార్త విని ఇప్పుడే మేల్కొన్నాను. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేని బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాము కోటగారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా సానుభూతి.          – అల్లు అర్జున్‌

 కోట శ్రీనివాసరావుగారు అసమాన ప్రతిభావంతుడు. సీరియస్‌ రోల్‌ అయినా, విలన్‌ రోల్‌ అయినా, కామెడీ రోల్‌ అయినా... ఇలాపోషించిన ఏ పాత్రకైనా ్ర పాణంపోశారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో చాలా సినిమాల్లో కలిసి పని చేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన కళ, ఆయన నవ్వు, ఆయనపోషించిన పాత్రలు సజీవంగా ఉంటాయి.         – విష్ణు మంచు  

 కోట శ్రీనివాసరావుగారు మాకు ఒక యాక్టర్‌గా కన్నా కూడా మా కుటుంబ సభ్యుడు. మా నాన్నగారు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి సెట్స్‌లో ఆయన్ను చూశాను. అలాగే నా తొలి సినిమా ‘అల్లరి’లో నా ఫాదర్‌గా చేశారు. మేం ఇద్దరం దాదాపు 40–50 సినిమాల వరకు కలిసి పని చేశాం.                       – ‘అల్లరి’ నరేశ్‌ 

 సినీపరిశ్రమలో ఉన్న కొద్దిమంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావుగారు ఒకరు. ఆయన నటనతో నా సినిమాలు ‘శివ, గాయం, మనీ, సర్కార్, రక్తచరిత్ర’లు మరింత ప్రభావితం అయ్యాయి. కోట శ్రీనివాసరావుగారూ... మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి ఉండొచ్చు... కానీ మీ పాత్రలు జీవించే ఉంటాయి      – రామ్‌గో పాల్‌ వర్మ

 కోట శ్రీనివాసరావుగారి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. నటనలో నిష్ణాతుడు.పోషించిన ప్రతి పాత్రకు ్ర పాణంపోసిన లెజెండ్‌. వెండితెరపై ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – ఎస్‌ఎస్‌ రాజమౌళి

 ఓ చరిత్ర ముగిసిపోయింది. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం చాలాసార్లు కలిగింది నాకు. ఆయనతో పని చేసే అవకాశం దొరికింది. వ్యక్తిగతంగానూ ఆయనతో మంచి అనుబంధం ఉంది. షూటింగ్‌ లేని సమయాల్లో కూడా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. – త్రివిక్రమ్‌

 కోటన్న, నేను సినిమాల్లోనే కాదు... విడిగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సినిమాల్లో ఎలా ఉండేవో అలాగే సెటైర్స్‌ ఉండేవి. మొన్న ఫోన్‌ చేస్తే... ‘ఎక్కడున్నావ్‌ రా... ఎప్పుడొస్తావ్‌ రా’ అంటే.. ‘రేపు వస్తా’నని అన్నాను. బాగా మాట్లాడాడు. ‘హా.. చాల్లేవోయ్‌’... ఇలా మా తరహా మాటల్లోనే మాట్లాడారు. ‘షాట్‌ సిద్ధమైంది అన్నా... మరలా చేస్తా’నని చెప్పి, మళ్లీ ఫోన్‌ చేస్తే, పడుకున్నారు. ఇంటికి వెళితే సంతోషపడేవాడు. ‘రారా.. చాలా బోర్‌ కొడుతోంది’ అనేవారు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్‌లో భోజనం చేశాం. మాటలకందని సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా ఇద్దరి మధ్య.              – బాబూమోహన్‌

 కోట శ్రీనివాసరావుగారు, నేను కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్‌ చేశాం. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌... ప్రతి సినిమాలో ఉండేవాళ్లం. నాలుగు దశాబ్దాలుగా ‘అరే... ఒరేయ్‌...’ (భావోద్వేగానికి లోనవుతూ..) అనుకుంటూ కలిసి ఉన్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడు ఒక నట రాజపుత్రుడు. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి.  – బ్రహ్మానందం

 ‘రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు. అహ నా పెళ్ళంట’... ఇలా చెప్పుకుంటూపోతే నా జీవితంలోని సూపర్‌హిట్‌ సినిమాలన్నింటిలోనూ కోట మామ ఉన్నారు. వారం క్రితం ఫోన్‌ చేసి, ‘ఏంటి మామ... ఆరోగ్యం ఎలా ఉందన్నాను’, ‘అబ్బాయ్‌... నువ్వు ఇంటికి రా’ అన్నారు. తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావుగారు. చాలా భాషల్లో నటుడిగాను మెప్పించారు. కోట మామగారూ... మీరు ఎక్కడ ఉన్నా మీ విలక్షణమైన శైలిలో అందర్నీ నవ్విస్తూ ఉండాలి.
– రాజేంద్రప్రసాద్‌

 తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభావంతులకు పెద్ద ఎత్తున చాన్స్‌ దొరకడం లేదనే బాధ కోటగారిలో ఉండేది. ఆయన ఆవేదన నిజమైనదని నాకు అనిపించింది. ఒకసారి ఎవరో అడిగారు... ప్రకాశ్‌రాజ్‌ పరభాష నటుడే కదా? అని. ‘ఆయన తెలుగు నేర్చుకున్నారు కదా. మనోడు అయిపోయాడు’ అన్నారు. మన భాషను తప్పుగా పలుకుతారు. మన అవకాశాలను ఎవరో తీసుకెళ్లిపోతారనేది ఆయనకు ఉండేది. ఇటీవల కోటగారు గుర్తొచ్చి... ఆయన ఎక్కడంటే, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలు చేయడం లేదన్నారు. ఫోన్‌ చేసి, ్ర΄÷డక్షన్‌ వారి నుంచి కారు పంపిస్తే ఆయన వచ్చారు... సరదాగా మాట్లాడుకున్నాం.   – ప్రకాశ్‌రాజ్‌

కోట శ్రీనివాసరావుగారితో కలిసి కొన్ని సినిమాలు చేయడం నా అదృష్టం. ఆయన అచీవ్‌ చేయనిది లేదు... చూడనది లేదు. తెలుగువారందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. నటన గురించే 24 గంటలూ ఆలోచించే మహానటుడు ఆయన.    – రావు రమేశ్‌

 ఆ తరంలో ఎస్వీ రంగారావుగారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ రావుగారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావుగారు. కోట బాబాయ్‌–నేను 200 సినిమాలకు పైనే కలిసి నటించాం. తెలుగు నటులంటే ఆయనకు చాలా ఇష్టం. బాబాయ్‌ అని మా సొంతవారిని ఎన్నిసార్లు పిలిచామో తెలియదు కానీ.. కోట బాబాయ్‌ అని కొన్ని లక్షలసార్లు పిలిచి ఉంటాము. – అలీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement