ఫీల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ ఫార్మాట్‌లో ఆస్కార్‌  | The Academy is bringing back this unique feature to the awards after 15 years: Oscars 2024 | Sakshi
Sakshi News home page

ఫీల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ ఫార్మాట్‌లో ఆస్కార్‌ 

Mar 6 2024 12:00 AM | Updated on Mar 6 2024 12:00 AM

The Academy is bringing back this unique feature to the awards after 15 years: Oscars 2024 - Sakshi

పదిహేనేళ్ల తర్వాత ఈ ఫార్మాట్‌ పునరుద్ధరణ 

ఆస్కార్‌ అవార్డు వేడుకలను వీలైనంత ఎక్కువమంది వీక్షకులకు చేరువ చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది ఆస్కార్‌ అవార్డు కమిటీ. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘ఫీల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ ఫార్మాట్‌ను పునరుద్ధరించాలని అనుకుంటోందట. అప్పటి వరకూ జరిగిన అవార్డు వేడుకల్లో ఆస్కార్‌ గెలుచుకున్న ఐదుగురు స్టార్స్‌ తాజా వేడుకలో పాల్గొని, విజేతలను ప్రకటించి, అవార్డును ప్రదానం చేయడమే ఈ ఫార్మాట్‌ ఉద్దేశం. గతంలో (2009) జరిగిన ఆస్కార్‌ అవార్డు వేడుకలో ఈ విధానాన్ని పాటించారు. ‘ఫీల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ పేరిట అప్పటి అవార్డు వేడుకలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.

అయితే ఆ తర్వాత జరిగిన వేడుకల్లో ఈ ఫార్మాట్‌ని ఫాలో కాలేదు. పదిహేనేళ్లకు ఈసారి ఈ విధానాన్ని పునరుద్ధరించాలని కమిటీ భావిస్తోందట. మాజీ ఆస్కార్‌ విజేతలు తాజా విజేతలను ప్రకటించి, అవార్డును ప్రదానం చేయడం అనేది చూడ్డానికి కనువిందుగా ఉందని 2009లో జరిగిన అవార్డు వేడుకలో పలువురు పేర్కొన్నారు. వీక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందట. కాగా, కరోనా తర్వాత ఆస్కార్‌ అవార్డు వేడుకల వీక్షకుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందని హాలీవుడ్‌ అంటోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సంఖ్యలో వీక్షకులను రాబట్టడానికి గతంలో సక్సెస్‌ అయిన ఈ ఫార్మాట్‌ని పునరుద్ధరించాలని కమిటీ భావించిందని హాలీవుడ్‌ భోగట్టా.

అయితే ఈ ‘ఫీల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ నటీనటుల విభాగానికి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ నెల 10న లాస్‌ ఏంజిల్స్‌లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్‌ ఈసారీ ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లుగా ‘ఫీల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ ఫార్మాట్‌ని కమిటీ  రీ విజిట్‌ చేసిందా? లేదా అనేది ఆ రోజు తెలిసిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement