ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సైరాబాను'. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణకాంత్ పారుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. 'ఎ ఫన్ ఫిల్డ్ జర్నీ ఆఫ్ లవ్, ఫెయిత్ అండ్ డెస్టినీ' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో ఆది సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై కనిపించారు. నుదుటిపై విభూతి, మెడలో రుద్రాక్ష మాలలతో ఆయన హిందూ యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. మరోవైపు బంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్‌లో ఆయన వెనుక కూర్చుని కనిపించడం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పోస్టర్ నేపథ్యంలో ఒకవైపు ఆలయం, మరోవైపు ఇస్లామిక్ నిర్మాణ శైలి కనిపించడం రెండు భిన్న సంస్కృతుల కలయికను ప్రతిబింబిస్తోంది. ప్రేమ, శాంతికి ప్రతీకగా తెల్లని పావురాలను కూడా పోస్టర్‌లో చూపించారు. దీంతో ఈ సినిమా హిందూ-ముస్లిం ప్రేమకథ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.


