72వ జాతీయ అవార్డులు (2024)
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నత గౌరవంగా పరిగణించబడే జాతీయ చలనచిత్ర పురస్కారాల మహోత్సవం నేడు (సెప్టెంబర్ 22, మంగళవారం) గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు ఇతర నాయకులు, ఉత్తరాది - దక్షిణాది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
గుజరాత్ లోని ఏక్తానగర్ లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' సమీపంలోని 'బస్ బే' (బస్ టెర్మినల్) ప్రాంతంలో ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అందుకోసం భారీ ఏర్పాట్లకు సోమవారం సైతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఘనమైన వేడుకను విజయవంతం చేసి, చిరస్మరణీయంగా నిలిపేందుకు వివిధ రంగాలకు చెందిన 500 మందికి పైగా సాంకేతిక నిపుణులు, కళాకారులు, కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
వాటర్ ప్రూఫ్… సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ గుడారం
‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ - సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద అతిథుల కోసం 1,000 మంది కూర్చునే ఏర్పాట్లతో, ఎయిర్ కండిషన్డ్ జర్మన్ డోమ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'కి సరిగ్గా పక్కనే 1,000 మంది కూర్చునే వీలుండే ఈ పెద్ద, హై-టెక్ డోమ్ నిర్మాణం అవుతోంది. ఈ ఆధునిక 'జర్మన్ అల్యూమినియం స్ట్రక్చరల్ డోమ్' పూర్తిగా వాటర్ ప్రూఫ్. అంతే కాకుండా, సెంట్రల్ ఎయిర్-కండిషన్డ్. కూర్చొనే వసతితో పాటు వేడుకలో అద్భుతమైన అనుభూతిని అందించడానికి, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, ఆధునిక లైటింగ్ సిస్టమ్‌తో పూర్తిగా సన్నద్ధం చేస్తున్నారు. అలాగే, అతిథులకు ప్రత్యేకంగా గుజరాతీ వంటకాలతో విందు చేయనున్నారు.
సాయంత్రం 4 గంటలకే అవార్డులు
జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాన కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ముందుగా, లాంఛనప్రాయంగా దీప ప్రజ్వలన, జాతీయ గీతాలాపనతో ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో, సుమారు 75 నిమిషాల పాటు జరిగే ప్రధాన ప్రోటోకాల్ సమావేశంలో, వివిధ విభాగాలలోని విజేతలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
లేజర్ షో వెలుగులు… సాంస్కృతిక జిలుగులు…
సాయంత్రం అయిదుంబావు గంటల నుండి 6 గంటల మధ్య సభికులు, సినీ ప్రముఖులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం అవార్డు విజేతలందరితో అధికారిక గ్రూప్ ఫోటో దిగుతారు. ప్రధాన కార్యక్రమం ముగిసిన తర్వాత, సాయంత్రం 6:30 గంటలకు నర్మదా నదీ తీరంలో అతిథుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రత్యేక థీమ్ ఆధారిత లేజర్, లైట్ అండ్ సౌండ్ షో (దృశ్యవాణి కార్యక్రమం) కూడా ఉంటుంది.
— గుజరాత్ లోని ఏక్తా నగర్ నుంచి ఆర్. జయ


