● ముందుకొచ్చిన 12 మంది మిల్లర్లు
● ఇక వేగం పుంజుకోనున్న కొనుగోళ్లు
● ఇప్పటి వరకు కొన్నది 15 వేల మెట్రిక్ టన్నులే..
మెదక్‌జోన్: ప్రభుత్వం మిల్లర్లపై కక్ష కట్టిందని చిన్నపాటి సమస్యలను సైతం సాకుగా చూపుతూ వేధింపులకు గురి చేస్తోందని, ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం దించుకోమంటూ రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. సెప్టెంబర్‌లో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఐక్యతారాగం వినిపించారు. ప్రస్తుతం దానిని అధిగమించి కొందరు మిల్లర్లు ధాన్యం దింపుకునేందుకు ముందుకు రావడంతో ఇక సేకరణ ఊపందుకోనుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 175 రైస్ మిల్లులు
జిల్లావ్యాప్తంగా రారైస్, బాయిల్డ్ రైస్ మిల్లులు 175 ఉండగా, వాటిలో 70 మిల్లులు వివిధ కేసులతో మూసివేశారు. మరో 35 మిల్లులను పలు కారణాలతో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇక 70 మిల్లులకు మాత్రమే ధాన్యం దింపుకునే అర్హత ఉంది. కాగా, ఈ ఏడాది రైస్ మిల్లుల తనిఖీలను పౌర సరఫరాల, విజిలెన్స్ శాఖలు సయుక్తంగా దాడులు చేసి ధాన్యం తక్కువ వచ్చిన వాటిపై కేసులు నమోదు చేస్తుండటంతో మిల్లర్లు మరింత ఐక్యతతో ధాన్యం గింజ ముట్టకూడదంటూ రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. ధాన్యం ఎన్నిసార్లు తూకం వేసినా తక్కువ వస్తోందని, అంత మాత్రాన కేసులు పెట్టి దొంగల్లాగా చూస్తున్నారని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము ధాన్యం దింపుకోమంటూ శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, మిల్లర్లు ముందుకు రాకపోవటంతో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 2.94 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 6 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని అధికారులు అంచనా వేశారు. 533 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 100 సెంటర్లు ప్రత్యేకంగా సన్నాల సేకరణకు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మిల్లర్లు ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు 170 సెంటర్లు మాత్రమే తెరుచుకున్నాయి.
వీరి బాటలో మరో 30 మంది!
తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ధాన్యం దింపుకోమంటూ చెప్పిన మిలర్లలో 12 మంది మాత్రం ఇటీవల ధాన్యం దింపుకుంటున్నారు. వీరి బాటలో మరో 30 మంది సైతం ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మిల్లర్ల సమ్మెను పక్కన బెట్టి ఒక్క మెదక్ జిల్లాలోనే మిల్లర్లు ముందుకొచ్చి దింపుకుంటున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటి వరకు కేవలం 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతుండగా, మరో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ధాన్యం దించుకోవడానికి 12 మంది మిల్లర్లు ముందుకు రావటంతో ఇక ధాన్యం సేకరణ వేగవంతం కానుంది. అల్పపీడనం నేపథ్యంతో వర్షసూచన ఉందంటూ వాతావరణ శాఖ చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.


