చిన్నశంకరంపేట(మెదక్): మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ పాదయాత్ర చేపట్టిన చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, కల్వకుంట సర్పంచ్ కొండల్‌రెడ్డి గురువారం రాత్రి కేసీఆర్‌ను కలిశారు. నాలుగు రోజుల క్రితం ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో కేసీఆర్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర చేపట్టారు. మెదక్, చిన్నశంకరంపేట, చేగుంట, దౌల్తా బాద్, గజ్వేల్ మీదుగా గురువారం ఎర్రవల్లికి చేరుకున్నారు. ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసి ప్రజల ఆకాంక్షను వివరించారు. ఈసందర్భంగా ఏడుపాయల నుంచి తీసుకొచ్చిన అమ్మ వారి ప్రసాదం అందజేశారు.
అదనపు కలెక్టర్ నగేశ్
వెల్దుర్తి(తూప్రాన్): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ మేరకు గురువారం మాసాయిపేట మండలం అచ్చంపేటలో ఎల్‌నినో ప్రభావంపై నిర్వహించిన గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. గ్రామసభలో అధికారులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పెద్దశంకరంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో రూ.20 లక్షలతో ప్రహరీ, ఆరేపల్లిలో రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ, ఉత్తులూర్‌లో రూ.10 లక్షలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనం, ఇంకుడు గుంతల పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ షాకీర్‌అలీ, వినోద్‌పాటిల్, నాయకులు నారాగౌడ్, మధు, మురళిపంతులు, ఆర్‌ఎన్.సంతోష్, దాచ సంగమేశ్వర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్‌లు జంగం రేణుక, వెంకట్‌రావు, శ్రావణి, జైపాల్‌గౌడ్, సాయిలు, మాజీ సర్పంచ్ రాములు, అంజిరెడ్డి, సుభాశ్‌గౌడ్, సుభాశ్, రవి, రాజుగౌడ్, రామకృష్ణాగౌడ్, పీఆర్ ఏఈ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని తుక్కా పూర్ వద్ద మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. మంజీరా నది గ్రామం పక్క నుంచే ప్రవహిస్తున్నప్పటికీ, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే చెక్ డ్యాం నిర్మాణంతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు వారి జీవనోపాధికి భరోసా లభిస్తుందన్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, మంత్రిని కోరారు.


