శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని పలు పంచాయతీలకు పరిశ్రమల ద్వారా వచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో సంబంధిత సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అధిక బిల్లులు రికార్డు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మండలంలోని శభాశ్‌పల్లి, నవాబుపేట గ్రామాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నా యి. ఏటా వాటి నుంచి శభాశ్‌పల్లి పంచాయతీకి రూ.18 నుంచి రూ. 20 లక్షల ఆదాయం వస్తుండగా, నవాబుపేట పంచాయతీకి రూ.12 నుంచి రూ.16 లక్షల ఆదాయం జీపీ ఖాతాల్లో జమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ కాలంలో ఆయా పంచాయతీల్లో జమ అయిన నిధులను సిబ్బంది తప్పుడు బిల్లులు నమోదు చేసి అధిక మొత్తంలో నిధులు కాజేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పంచాయతీల్లో జమ, ఖర్చుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా పలువురు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసినా, అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక అధికారుల పాలనలో పరిశ్రమల ద్వారా ఆయా పంచాయతీలకు జమ అయిన నిధులు, సిబ్బంది రికార్డుల్లో నమోదు చేసిన తప్పుడు లెక్కలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


