చివరికి కంటతడి | - | Sakshi
Sakshi News home page

చివరికి కంటతడి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

చివరికి కంటతడి

పెట్టుబడి నష్టపోయా

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువుఛాయలు అలుముకున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో పాటు తీవ్రమైన కరెంట్‌ కోతలతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిధిలో వెయ్యి ఎకరాల మేర వరి ఎండిపోయే పరిస్థితిలో ఉంది.

– రామాయంపేట(మెదక్‌)

జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 2.94 లక్షల ఎకరాల్లో రైతుల వరి సాగు చేశారు. వరుస తడులతో రైతులు పంటకు సాగు నీరందిస్తున్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. చివరి దశలో ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మూడు నెలల పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకున్న రైతులు వరి పొట్ట దశలో నీరందక అవస్థలు పడుతున్నారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

25 శాతం లోటు వర్షపాతం

ఈసారి జిల్లావ్యాప్తంగా 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి కొందరు రైతులు కొత్తగా బోర్లు తవ్విస్తుండగా, మరికొందరు ట్యాంకర్ల ద్వారా నీరు అందించడానికి విఫలయత్నం చేస్తున్నారు. తమ చుట్టుపక్కల బోర్లలో నీరుంటే తడికి ఇంత చొప్పన డబ్బు లు మాట్లాడుకొని నీరు పారించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, జిల్లాలోని 14 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు.

పశువులకు మేతగా..

చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్‌ కొండాపూర్‌కు చెందిన రైతు ఏగోండ రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇందులో రెండెకరాలు నీరందక ఎండిపోయింది. దీంతో పంటను పశువుల మేతగా వదిలేశాడు. ఇలా.. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి పొలాలు నీరు లేక నెర్రెలుబారి పొట్ట దశలో నీరు లేక ఎండిపోయాయి. దీంతో ఏం చేయలేక రైతులు పశువులకు మేతగా వదిలేస్తున్నారు.

ఎండిన వరి చేనులో మేకలు మేపుతున్న మహిళ

14 మండలాల్లో కరువుఛాయలు

జిల్లాలో ఎండుదశలో వెయ్యి ఎకరాలు

పశువుల పాలవుతున్న పంటలు

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన యంత్రాంగం

ప్రభుత్వానికి నివేదించాం

ఎల్‌నినో ప్రభావంతో జిల్లా లో ఎండుతున్న పంటల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఈమేరకు ప్రతి రోజు పంట నష్టానికి సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వచ్చే రబీ సీజన్‌లో రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి.

– దేవ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి

నాలుగెకరాల్లో వరి సాగు చేశాను. ఇందులో రెండున్నర ఎకరాల మేర పంట ఎండిపోయింది. మిగితా పంట కూడా చేతికి వచ్చే అవకాశం లేదు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలి.

– రవి, గంగాపూర్‌, హవేళిఘణాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement