కన్నపేగులు దూరమై.. బుక్కెడు బువ్వ కరువై | - | Sakshi
Sakshi News home page

కన్నపేగులు దూరమై.. బుక్కెడు బువ్వ కరువై

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

వృద్ధదంపతుల బలవన్మరణం

సోమవారం నుంచి కనిపించకుండా వెళ్లి..

భార్యకు పక్షవాతం..

● ముగ్గురు కొడుకులున్నా.. అనాథలుగానే జీవనం

● నారాయణఖేడ్‌ మండలంలో విషాదాంతం

నారాయణఖేడ్‌: నవమాసాలు పెంచి.. పోషించి.. ఉన్నతంగా తీర్చిదిద్ది.. కడుపు కట్టుకొని సంపాదించిన ఆస్తిని సైతం పంచి ఇచ్చినా.. వృద్ధాప్యంలో పట్టెడు మెతుకులు పెట్టకపోవడంతో ఆ దంపతులు విలవిల్లాడారు. కన్నపేగులు కనికరం చూపకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చేసేదిలేక ఆ వృద్ధదంపతులు చావే శరణ్యంగా భావించి.. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన చూపరులను కలిచి వేసింది. ఈ ఘటనతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం చాప్టా(కె) గ్రామం గొల్లు మంది. కోట్ల విలువగల ఆస్తులు సంపాదించినా చివరకు బుక్కెడు బువ్వకు నోచుకోని ఆ ముసలి ప్రాణాలు ఎంత విలవిల్లాడాయో అంటూ కంట తడిపెట్టారు.

కడుపు కట్టుకొని ఆస్తులు కూడబెట్టి..

చాప్టా (కె) గ్రామంలో ముంగే నర్సారెడ్డి (88), ముంగే అంజమ్మ (85)లు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు సిద్దారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి సంతానం. సిద్దారెడ్డి, సంగారెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా రెండో కుమారుడు కిష్టారెడ్డి హైదరాబాద్‌కు వలసవెళ్లాడు. వృద్ధ దంపతులకు పెద్దల ద్వారా 12 ఎకరాల ఆస్తి రాగా వీరిద్దరూ కష్టించి వ్యవసాయం చేసి మరో 18 ఎకరాల వరకు కొనుగోలు చేసి మొత్తం 30 ఎకరాల భూమిని పోగు చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం భూమి విలువ రూ.12 కోట్ల పైమాటే. రెండో కుమారుడు కిష్టారెడ్డి గ్రామంలో ప్రేమ వివాహం చేసుకోవడంతో అది నచ్చని తండ్రి ఆస్తిలో ఇతనికి వాటా ఇవ్వకుండా ఇద్దరు కుమారులకే చెరిసగం ఆస్తి ఇచ్చాడని గ్రామస్తులు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత బాధపడ్డ తల్లిదండ్రులు రెండో వాడికి కూడా ఇస్తి ఇవ్వాలని కోరినా ఇద్దరు కొడుకులు ససేమిరా అంటూ మొండికేశారు. కానీ ఇంత ఆస్తి సంపాదించినా చివరకు వృద్ధులు బుక్కెడు బువ్వకు కరువయ్యారు.

అధికారులకు చెప్పినా..

తమను కొడుకులు పోషించడంలేదని, ఆస్తి తిరిగి తనకు ఇప్పించాలని, లేదా పోషించేలా చూ డాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి మొదలు కొని స్థానిక ఆర్డీఓ, పోలీసులకు రెండేళ్ల నుంచి పలుమార్లు నర్సారెడ్డి, అంజమ్మలు ఫిర్యా దు చేశారు. అధికారులు, పోలీసులు కొడుకులకు నచ్చచెప్పి కౌన్సెలింగ్‌ చేసి పంపించారు. అయినా తిరిగి వారు తీరు మారకపోవడంతో వృద్ధులకు జీవనం కష్టంగా మారింది. వచ్చే వృద్ధాప్య పింఛన్‌తోపాటు బంధువులు, పాఠశాల వద్ద మధ్యాహ్న భోజనం, తెలిసిన వారి వద్ద తింటూ కాలం వెల్లదీశారు.

నర్సారెడ్డి, అంజమ్మలు సోమవారం నుంచి కనిపించకుండా పోయారు. ఎవరైనా బంధువుల వద్దకు వెళ్లారేమోనని గ్రామస్తులు భావించారు. బుధవారం చిన్నకుమారుడు సంగారెడ్డి తన వ్యవసాయ భూమికి వెళ్లడంతో బావిలో తల్లి శవం తేలుతూ కన్పించడంతో గ్రామస్తులకు విషయం తెలిపారు.

అంజమ్మకు కొన్నాళ్ళ క్రితం పక్షవాతానికి గురవడంతో పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడేది. నర్సారెడ్డికి వయస్సు పైబడటంతో ఏమీ పనులు చేసుకోలేకపోయేవారు. ఇద్దరు కొడుకులు సాకక పోవడంతో దాయాదులు ఇచ్చిన ఓ ఇంట్లో ఉంటూ జీవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement