ప్రగతి పరుగులు | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పరుగులు

Sep 30 2026 7:36 AM | Updated on Sep 30 2026 7:36 AM

కేంద్రం నిధులతో వడివడిగా అభివృద్ధి

కేజీబీవీకి ఎంపీ సొంత నిధులతో...

వెనుక బడిన మెతుకు సీమకు కేంద్రం నిధులు వరంగా మారాయి. మెదక్‌–చేగుంట రహదారిపై రైల్వేట్రాక్‌ ఆర్వోబీ పనులు చకచకా జరుగుతుండగా 44వ జాతీయరహదారి రామాయంపేటవద్ద తరుచూ ప్రమాదాలు జరిగేచోటా ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. మెదక్‌–ఎల్కతుర్తి జాతీయరహదారికి ఇరువైపులా వేలాది మొక్కలతో పచ్చదనం పరుచుకోనుంది. కేజీబీవీలో గల తాగునీటి, విద్యుత్‌ సమస్య తీరింది.ఇలా ఎంపీ రఘునందన్‌రావు చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. –మెదక్‌జోన్‌

మెదక్‌ జిల్లా అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైంది. పేరుకే ఇది జిల్లాగా కొనసాగినప్పటికీ పాలనంతా సంగారెడ్డి కేంద్రంగా సాగింది. హైదరాబాద్‌కు సంగారెడ్డి దగ్గరగా ఉండటంతో గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. 2016లో ప్రత్యేక జిల్లా ఏర్పాటయ్యాక కొంత అభివృద్ధికి నోచుకుంది. కాగా, మెదక్‌–చేగుంట ప్రధాన రహదారికి చేగుంట రైల్వేగేటు అడ్డుగా ఉండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైలు వచ్చిన ప్రతీసారి 10 నిమిషాలకుపైగా గేటు వేయటంతో ప్రయాణికులు ఆగిపోవటం, కొన్ని సందర్భాల్లో 108–104 అంబులెన్స్‌లు సైతం ఆగిపోయి ప్రాణనష్టం జరిగిన ఘటనలున్నాయి. ఈ ప్రాంతంలో ఆర్‌ఓబ్రిడ్జి నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది.

ఇటీవలే కేంద్రం రూ.47 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి. ఇక ప్రయాణికుల సమస్య తొలగిపోనుంది. అలాగే తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లి రైల్వేగేట్‌ వద్ద సైతం ఆర్వోబీ, ఆర్‌యూబీ బిడ్జ్రిల నిర్మాణం కోసం రూ.50 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. 44వ జాతీయ రహదారి జిల్లాలోని కాళ్లకల్‌ నుంచి రామాయంపేట వరకు సుమారు 50 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉంది. కాగా, రామాయంపేట సమీపంలోని అడియాస్‌ హోటల్‌వద్ద వై జంక్షన్‌ ప్రాంతంలో తరుచూ ప్రమాదాలు జరిగేవి. దీంతో వారంలో ఒకరిద్దరు మృత్యువాత పడేవారు. ఇక్కడ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.44 కోట్లు మంజూరు కాాగా పనులు ప్రారంభమయ్యాయి.

జాతీయరహదారిపై మొక్కలు...!

మెదక్‌–ఎల్కతుర్తి జాతీయరహదారి రామాయంపేట నుంచి సిద్దిపేట 43 కిలో మీటర్లు ఉండగా రోడ్డుకిరువైపులా 30 వేల బాదం మొక్కలు నాటేందుకు గుంతలు సైతం తీశారు. ఇప్పటి వరకు 18 బోర్లు తవ్వించారు. ఇందుకోసం డ్రిప్పు వేయనున్నారు. దీనిని త్వరలో గవర్నర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. దీన్ని ఐదేళ్లపాటు ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించనున్నారు.

మెదక్‌ రింగ్‌రోడ్డుసైతం...!

బాలనగర్‌–వయా నర్సాపూర్‌ మీదుగా మెదక్‌ వరకు 765(డీజీ) జాతీయరహదారిని నాలుగు లైన్లు రోడ్డు మంజూరైంది. ఇది మెదక్‌ మండలం మంబోజిపల్లి నుంచి హల్దీవాగు మీదుగా భారీ బ్రిడ్జిని నిర్మించి బోధన్‌ రోడ్డు వరకు 14 కిలోమీటర్ల వరకు రింగ్‌రోడ్డు మంజూరైంది. దీనికి సంబంధించి డీపీఆర్‌ సైతం పూర్తి అయినట్లు తెలిసింది. కాగా, చేగుంట మీదుగా మెదక్‌ రింగ్‌ రోడ్డుకు మాత్రం తర్వాత మంజూరు కానున్నట్లు తెలిసింది.

ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం

మెదక్‌–చేగుంట ఆర్వోబ్రిడ్జితో సమస్యకు చెక్‌

44వ జాతీయరహదారిపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జి

జిల్లా కేంద్రంలోగల కేజీబీవీలో విద్యుత్‌, నీటిసమస్యకు పరిష్కారం

మెదక్‌–ఎల్కతుర్తి జాతీయరహదారిపై 30 వేల మొక్కలు నాటే కార్యక్రమం

మెదక్‌ జిల్లా కేంద్రంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, కాలేజీ తోపాటు ఆర్వో వాటర్‌ప్లాంట్‌కు సైతం విద్యుత్‌ కనెక్షన్‌ ఒకే మీటర్‌నుంచి ఏర్పాటు చేయటంతో లోవోల్టేజీ సమస్య ఏర్పడి కనీసం బోరుమోటర్‌ నడవక పోవటం, ఫ్యాన్లు తిరగకపోవటంతోపాటు, నీటి సమస్యతో స్నానాలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎంపీ తన సొంత నిధులతో స్వయంగా కేజీబీవీకి మరో విద్యుత్‌ మీటర్‌ను ఏర్పాటు చేయించడంతోపాటు బోరును తవ్వించారు. 320 మంది బాలికలకు సరిపడ మరుగుదొడ్లు, బాత్‌రూములు నిర్మిస్తానని హామీనిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement