కొల్చారం(నర్సాపూర్): రాబోయే సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులు పాలక మండలికి సూచించారు. మహాసభ సంఘం చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో సంఘం నివేదికను సీఈఓ నవీన్ చదివి వినిపించారు. మహాసభలో రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను విన్నవించారు. ప్రతీసారి ధాన్యం రవాణ సమయంలో ధాన్యం తూకం ఆలస్యం కావడం, రవాణాపరంగా ఇబ్బందులు తప్పడం లేదంటూ విన్నవించారు. అటు రైస్ మిల్లర్లు తరుగు పేరిట కిలోల కొద్ది ధాన్యాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. అనంతరం రమేశ్‌కుమార్ మాట్లాడుతూ రైతుల సూచనలు, సలహాల మేరకు ఈసారి ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. రైతులు సకాలంలో తీసుకున్నటువంటి రుణాలను చెల్లించాలని కోరారు. నాబార్డ్ ద్వారా ద్వారా 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం మంజూరైందని, రైతుల సలహా మేరకు సంఘం ఆవరణలోని అనువైన స్థలంలో గోదాం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం వైస్ చైర్మన్ మల్లేశం, సంఘం పరిధిలోని గ్రామాల సర్పంచులు ఆంజనేయులు, రవితేజరెడ్డి, డైరెక్టర్లు ప్రవీణ్‌రెడ్డి, దుర్గేశ్‌గౌడ్, రమేశ్, సాయిలు, రైతులు పాల్గొన్నారు.
రంగంపేట పీఏసీఎస్ మహాసభలో రైతులు


