నర్సాపూర్: రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటివని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో బీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించిడంతోపాటు ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యల నివేదికను స్పీకర్ ముందుంచాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ఖండించగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కేసులు పెట్టించడం దారుణమన్నారు. రాష్ట్రంలో నయవంచన పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే మేధావులు, ప్రతిపక్షాల నాయకుల గొంతును ప్రభుత్వం నొక్కివేయడంతోపాటు వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ వారందరిని అణచివేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాగా, ఇటీవల వినాయక నిమజ్జనం కార్యక్రమంలో యువకులు కేసీఆర్ పాట పెట్టుకుని నృత్యాలు చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హామీల అమలులో విఫలం చెందిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నాయకులు శేఖర్, నయిమోద్దీన్, భిక్షపతి, ప్రసాద్, జీవన్‌రెడ్డి, లియాకత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


