● బకాయిలు రాబట్టడానికి చర్యలు
● పీవీ యాప్‌ను అమల్లోకి తెచ్చిన పౌర సరఫరాలశాఖ
రామాయంపేట(మెదక్): పేరుకుపోయిన సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) బకాయిలు రాబట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పీవీ (ఫిజికల్ వెరిఫికేషన్) యాప్‌ను అమలులోకి తెచ్చింది. దీంతో పాటు ప్రతి బుధవారం అన్ని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని రైస్ మిల్లులపై నిరంతర నిఘా కొనసాగనుంది. జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 100 రైస్ మిల్లులున్నాయి. వీటిలో గత మూడేళ్లకు సంబంధించి రూ. 200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వసూళ్ల విషయమై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరైన ఫలితం కనబడటం లేదు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా నర్సాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, తదితర మండలాలల్లో వ్యాపారులపై కేసులు నమోదు చేసి బాధ్యులను జైలుకు పంపారు. ఇక నుంచి మిల్లర్లపై నిరంతర పర్యవేక్షణకై అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి బుధవారం జిల్లాలోని అన్ని రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
మిల్లర్లపై ఉక్కుపాదం
సీఎంఆర్ విషయంలో అక్రమాలను అరికట్టడంతో పాటు బకాయిల వసూళ్ల విషయమై ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే విజిలెన్స్, గ్రేహౌండ్స్ పోలీసులను రంగంలోకి దింపింది. ఈమేరకు ఎంపిక చేసిన ఫోర్స్‌కు మూడు రోజుల పాటు నగరంలో శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు రైసు మిల్లుల తనిఖీలకు వెళ్లినప్పుడు ఈఫోర్స్ వారికి రక్షణగా ఉంటారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైసుమిల్లుల్లో తనిఖీలు ప్రారంభమయ్యాయి. జిల్లాస్థాయిలో డీఎస్‌ఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సివిల్ సప్‌లై అధికారుల వివరాలు ముందస్తుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఎంపిక చేసిన బృందంలోని సభ్యులకు ప్రతి మంగళవారం వారి సెల్‌ఫోన్‌కు సమాచారం అందజేస్తారు. బుధవారం ఏ రైస్ మిల్లుకు తనిఖీకి వెళ్లాలనేది ఆ సమాచారంలో వివరాలు అందజేస్తారు ఇలా ప్రతి వారం తనిఖీలకు వెళ్లే అధికారులు మా రుతుంటారు. అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేస్తున్న క్రమంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. అక్రమాలు జరిగినట్లు తేలితే అక్కడి నుంచే వివరాలను యాప్‌లో నమోదు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదిస్తారు. తాజాగా గురువారం చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ శివారులోని బాలాజీ రైస్‌మిల్లులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 29 వేల బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. మాయమైన ధాన్యం విలువ రూ. 3.30 కోట్ల మేర ఉంటుందని ప్రకటించారు.


