కౌడిపల్లి కళాశాలకు వెళ్లాలని విద్యార్థులకు ఆదేశాలు
నర్సాపూర్: గిరిజన గురుకుల అప్‌గ్రేడేడ్ జూనియర్ కాలేజీని ఎత్తివేసే చర్యలు సాగుతున్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల విద్యాలయం ప్రాంగణంలో పాఠశాల, కాలేజీలు ఉన్నాయి. బాలుర కాలేజీని 2025లో ప్రారంభించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ఇంటర్ విద్యనందిస్తున్నారు. కాగా, కాలేజీని 2018లో ప్రతిభ గిరిజన గురుకుల కాలేజీగా మార్పు చేసి రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ఇంటర్ విద్య దూరమైందని తల్లిదండ్రుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు స్థానిక పాఠశాల ప్రాంగణంలోనే 2020లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఒకేషనల్ గ్రూపులతో గిరిజన బాలుర అప్‌గ్రేడేడ్ జూనియర్ కాలేజీని ప్రారంభించి కాంట్రాక్ట్ లెక్చరర్లతో బోధన కొనసాగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో 46 మంది విద్యార్థులతో బోధన సాగిస్తున్నారు. అయితే కొంతకాలం తర్వాత కొన్ని గ్రూపులు, తాజాగా మళ్లీ కాలేజీని ఎత్తివేసే చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అందులో భాగంగానే కౌడిపల్లి గిరిజన గురుకుల కాలేజీకి వెళ్లి చదువుకోవాలని విద్యార్థులకు లెక్చరర్లు సూచించినట్లు తెలిసింది. ఈనెల 26 వరకు అక్కడ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పినట్లు విద్యార్థులు వాపోతున్నారు. 2024లో సైతం కాలేజీని ఎత్తివేయాలని చూడగా ‘గురుకుల కాలేజీకి మంగళం?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో విరమించుకున్నారు.


