భద్రత లేని బడి బస్సు | - | Sakshi
Sakshi News home page

భద్రత లేని బడి బస్సు

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

డ్రైవర్లు, అటెండెంట్ల నిర్లక్ష్యం

తమ పిల్లలను సురక్షితంగా బడికి తీసుకెళ్లి, ఇంటికి తీసుకొస్తుందని తల్లిదండ్రులు నమ్మే బడి బస్సులో లోపాలు బయటపడుతున్నాయి. డ్రైవర్లు, అటెండెంట్‌ (సహాయకుల) నిర్లక్ష్యం కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కన్న తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిలుతుంది. జిల్లాలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రైవేట్‌ పాఠశాలలపై అధికారుల అజమాయిషీ కరువైందనే విమర్శలున్నాయి.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 114 పైవేట్‌ పాఠశాలలుండగా, వాటిలో 41,321 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పిల్లలను నిత్యం రవాణ చేసేందుకు 331 బస్సులు ఉన్నాయి. వాటిలో 306 బస్సులు ఫిట్‌మెంట్‌ చేయించుకోగా, మిగితా 25 బస్సులు ఫిట్‌మెంట్‌ చేసుకోలేదని తెలుస్తోంది. కాగా, 15 ఏళ్లు దాటిన బస్సుల కండిషన్‌ తగ్గటంతో వాటిని విద్యార్థుల రవాణ కోసం ఉపయోగించకూడదు. కానీ వాటిని సైతం రోడ్లపై తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నర్సాపూర్‌లో ఇటాంటి రెండు బడి బస్సులను రవాణశాఖ అధికారులు సీజ్‌ చేశారు.

జిల్లాలో తరచూ ఘటనలు

డ్రైవర్లు, అటెండెంట్‌ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండేళ్ల క్రితం మెదక్‌ పట్టణంలోని తారకరామనగర్‌ కాలనీలో ఓ విద్యార్థి పాఠశాల బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా బస్సుతో విద్యార్థిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాజాగా చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన 6 ఏళ్ల చిన్నారిని ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.15 రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు మెదక్‌ మండలం శివ్వాయిపల్లి నుంచి విద్యార్థులను తీసుకొని మెదక్‌ వస్తుండగా అదుపు తప్పి రోడ్డుకిందకు దిగింది. తృటిలో ప్రమాదం తప్పింది. 2014లో తూప్రాన్‌లోని ఓ పాఠశాలకు చెందిన ఓ ప్రైవేట్‌ బస్సు విద్యార్థులను తీసుకుని వస్తుండగా మాసాయిపేట సమీపంలోని రైల్వేగేట్‌ వద్ద పట్టాలపై ఆగిపోగా, రైలు ఢీకొన్న ఘటనలో మొత్తం 18 మంది మృతిచెందారు. అందులో 16 మంది విద్యార్థులతో పాటు డ్రైవర్‌, అటెండెంట్‌లు ఉన్నారు.

గాల్లో కలుస్తున్న విద్యార్థుల ప్రాణాలు

తాజాగా జంగరాయిలో చిన్నారిని చిదిమేసిన బస్సు

ఆందోళనలో తల్లిదండ్రులు

నిబంధనలకు నీళ్లు

ప్రైవేట్‌ పాఠశాలల్లో కనీస నిబంధనలు పాటించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్‌ కమిటీని విధిగా వేసి, మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలి. అందులో డ్రైవర్‌, అటెండెంట్‌ల ప్రవర్తన గమనించాలి. అంతే కాకుండా నెలకోసారి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరిద్దరూ బస్సులో విద్యార్థులతో పాటు పాఠశాల వరకు ప్రయాణించి డ్రైవింగ్‌ ఎలా చేస్తున్నాడో గమనించాలి. అటెండెంట్‌ విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరును సైతం పరిశీలించాలి. కానీ ఏ స్కూల్లోనూ పేరెంట్స్‌ కమిటీలు వేయటం లేదు సమావేశాలు నిర్వహించటం లేదు. దానికి తోడు పాఠశాలలపై సంబంధిత అధికారుల అజమాయిషీ సైతం కరువైంది. ఫలితంగా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement