పాపన్నపేట(మెదక్): గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. సోమవారం పాపన్నపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండపాల ఏర్పాటు సమాచారం పోలీసులకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన యువజన సంఘాల సభ్యులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ రాజేందర్ ఈనెల 1న హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
తూప్రాన్: 10వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక ఈనెల 9న మనోహరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణగుప్త సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2012 జనవరి 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. ఆధార్, బర్త్ సర్టిఫికెట్‌తో పాటు క్రీడా సామగ్రితో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 8106555942 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కొల్చారం(నర్సాపూర్): రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి ప్రతాప్‌సింగ్ సూచించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్‌లో మెగా ప్లాంటేషన్ కింద ఆయిల్‌పామ్ సాగును ప్రారంభించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 31 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఏఓ శ్వేతాకుమారి, మేనేజర్ కృష్ణరావు, ఉప సర్పంచ్ రవీందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంలో అక్రమంగా కొనసాగుతున్న పలు క్లినిక్‌ల్లో తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ప్రిస్కిప్షన్‌పై డాక్టర్ అని పెట్టుకోవడంతో డీఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఎంపీ క్లినిక్‌ల్లో ఇంజక్షన్లు, గ్లూకోజ్ ఎక్కించొద్దని ఆదేశించారు.


