కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందులో భూభారతి 22, ఇందిరమ్మ ఇండ్లు 09, పెన్షన్లు 05, ఇతర 25 మొత్తం 61 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. అనంతరం హైదరాబాద్ సీఎం ప్రజావాణి అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై వివరించారు. అనంతరం పట్టణంలోని ఈవీఎం గోదాములను తనిఖీ నిర్వహించారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి రెవెన్యూ, మైనింగ్, భూముల కొలతల శాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఖనిజాల లీజుల ద్వారా రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖనిజ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఈ వేలం విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.


