మట్టి.. కొల్లగొట్టి
నర్సాపూర్ రూరల్: పగలు, రాత్రి తేడా లేకుండా కాళేశ్వరం కాలువ మట్టి, రాళ్లను కొంతమంది వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. మండలంలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ ప్యాకేజ్– 18 టన్నెల్ పనుల్లో భాగంగా తవ్విన మట్టి, రాళ్లు ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టన్నెల్ తవ్వకాల సమయంలో కాల్వకు ఇరువైపులా గుట్టలను తలపించేలా భారీగా మట్టి రాళ్లను ఎత్తి పోశారు. మూడేళ్ల క్రితం ఈ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి పనులు చేపట్టిన కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేయాల్సిన ఇరిగేషన్ సిబ్బంది ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిని ఆసరాగా చేసుకొని అక్రమ మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి, రాళ్లను యథేచ్ఛగా తరలిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తి బహిరంగంగా తరలిపోతున్న సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్మును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


