చిన్నశంకరంపేట(మెదక్): 18 ఏళ్లు నిండిన నూతన ఓటర్లు తమ దరఖాస్తులు అందించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. ఆదివారం మండలంలోని రుద్రారం, కొర్విపల్లి పోలింగ్ బూత్‌లను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఓటర్లు ఫారం–6 ద్వారా దరఖాస్తులు అందించాలన్నారు. అలాగే ఏదైనా సవరణ అవసరమైతే ఫారం–8 ద్వారా అందించాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, నోటీస్‌లు అందుకున్నవారు తమ వివరణ అందించాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, ఆర్‌ఐ రాజు ఉన్నారు.
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయల కోసం వచ్చిన వారి సెల్‌ఫోన్‌లు చోరీకి గురవుతున్నాయి. వారాంతపు సంతకు సమీప గ్రామాల నుంచి ప్రజలు, పరిశ్రమల కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో జేబుల్లోని సెల్‌ఫోన్‌లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారు. ప్రతివారం చోరీలు పరిపాటిగా మారిపోవడంతో సంతకు రావడానికి జనాలు జంకుతున్నారు. గతం వారం సంతలో ఒకేరోజు పది మంది ఫోన్‌లు చోరీకి గురైనట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెల్‌ఫోన్‌లు దొంగిలిస్తూ మైనర్లు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు నిఘాను పెంచి మార్కెట్‌లో సెల్‌ఫోన్ దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
మెదక్ కలెక్టరేట్: మాలల రోస్టర్ పాయింట్ సవరించాలని జేఏసీ నేతలు జెల్లా సుధాకర్, కల్లూరు సంజీవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్‌లో వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల అమలులోకి వచ్చిన నూతన రోస్టర్ పాయింట్‌తో విద్యా, ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నేటి ధర్నాలో మాలలు, నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నరేష్, శివ, ఆనందం, ప్రసాద్, మహిపాల్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రాయికోడ్(అందోల్): ఎరువులు, రసాయనాలు మోతాదుకు మించకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి సారిక అన్నారు. మండలంలోని శంశోద్దీన్‌పూర్‌లో అయిల్‌పామ్ పంటలో అంతర పంటగా సాగు చేసిన మినుము పంటను వ్యవసాయశాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మినుము పంటలో మొక్కల ఎదుగుదల, పూత, ఆశించిన దిగుబడి పొందేందుకు నేల స్వభావానికి తగ్గట్లుగా సమతుల్య ఎరువులను వినియోగించాలన్నారు. ఆధునిక పోషక యాజమాన్య పద్ధతులను అవలంభించాలని సూచించారు. నానో డీఏపీ, యూరియాను రైతులకు అందించి, వాటితో కలిగే ప్రయోజనాపై అవగాహన కల్పించారు. నీటి యాజమాన్యం, కలుపు నివారణ మార్గాలను వివరించారు. అంతర పంటల సాగుతో రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మమత, రమేశ్ రైతులు పాల్గొన్నారు.


