యువతకేదీ భరోసా? | - | Sakshi
Sakshi News home page

యువతకేదీ భరోసా?

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

నీరుగారుతున్న ‘పీఎంఈజీపీ’

బ్యాంకర్లు కరుణ చూపుతేనే!

తెరుచుకోని వెబ్‌సైట్‌

ఐదు నెలలుగా ఎదురుచూపులు

ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) నీరుగారిపోతుంది. ఏటా మార్చిలో ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావొస్తున్నా నేటికీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. పథకం గురించి గొప్పగా ప్రచారమే చేయడమే తప్ప ఆచరణలో లబ్ధిదారులకు సరైన ఫలాలు అందిన దాఖలాలు లేవు. దీంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. దీంతో నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన(పీఎంఈజీపీ) పథకం ద్వారా సబ్సిడీ రుణాలు పొంది చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకులు, పరిశ్రమల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనగా, మార్చిలోనే రుణాలు పొంది వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా పీఎంఈజీపీ పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేటికీ లాగిన్‌ ఓపెన్‌ కావడం లేదని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవగాహన మాత్రం అదుర్స్‌

‘పీఎంఈజీపీ’ పథకాన్ని నిరుద్యోగులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సర్వీస్‌ సెక్టార్‌కు రూ. 20 లక్షల వరకు రుణం లభిస్తుందని, దీనిని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పితే సదరు లబ్ధిదారుడు తీసుకున్న రుణం మొత్తంలో 35 శాతం, అదే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే రూ. 25 శాతం సబ్సిడీ లభిస్తోందని చెబుతున్నారు. అంతే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్‌ కోసం ఒక్కో వ్యక్తికి రూ. 50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఇది కూడా రూరల్‌ ఏరియాలో ఏర్పాటు చేసుకుంటే రూ. 35 శాతం, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. ఒక్క జనరల్‌ కేటగిరికి చెందిన (మెన్‌)కు మాత్రమే సబ్సిడీ తక్కువగా ఉంటుంది. అదే జనరల్‌ కేటగిరికి చెందిన మహిళ సబ్సిడీ సమానంగా ఉంటుందంటూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకుందామనుకుంటే వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవటంతో నిరాశ నిస్పృహలో ఉన్నారు.

అర్హులు వీరే..

ఈ పథకానికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 8వ తరగతి చదువుకుని ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీఎస్‌) సభ్యులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాలు పొంది పరిశ్రమ ఏర్పాటు చేశాక పోస్టల్‌శాఖ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తారు. అప్పుడు సబ్సిడీ లభిస్తోంది. పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు యూనిట్‌ను తప్పనిసరిగా రన్‌ చేయాలనే నిబంధన ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాలు పొందాలంటే బ్యాంకు అధికారుల అనుగ్రహం తప్పనిసరి. లేకుంటే సబ్సిడీ పథకాలు లబ్ధిదారులకు చేరవు. రుణం తీసుకోవాలనుకునే సర్వీస్‌ బ్యాంకులో కొన్నాళ్ల పాటు అకౌంట్‌ కలిగి ఉండి, ఇతర రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి ఉండాలనే నిబంధన ఉంది. సకాలంలో చెల్లించకుంటే సిబిల్‌ స్కోర్‌ సరిగా లేదని బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు నిరాకరించే ఆస్కారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement