యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

యాప్‌సోపాలు

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

యూరియా కోసం తప్పని అవస్థలు

వారం రోజుల క్రితం పాపన్నపేట మండలం కొడుపాకకు చెందిన కాశినాథ్‌ కుటుంబీకులకు మంబోజిపల్లిలోని డీసీఎంఎస్‌ పేరిట 19 యూరియా సంచులు బుక్‌ అయ్యాయి.దీంతో రూ.1000 ఖర్చు చేసి ట్రాక్టర్‌ కిరాయికి తీసుకొని, మరో ఇద్దరు మనుషులకు కూలీ డబ్బులు చెల్లించి ఆ షాపు వద్దకు వెళ్లగా.. అది ఎప్పుటి నుంచో మూసివేసి ఉందని తెలిసి లబోదిబోమన్నారు.

‘కొత్తపల్లి సొసైటీకి రెండు రోజుల క్రితం 560 బ్యాగుల యూరియా వచ్చింది. కానీ యాప్‌లో సుమారు రెండు వేల బస్తాలు బుక్‌ అయ్యాయి. బుక్‌ చేసుకున్న రైతులు ఆశతో సొసైటీకి వెళ్తే.. మా దగ్గర యూరియా బస్తాలు ఎప్పుడో అయి పోయాయని సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు.

పాపన్నపేట(మెదక్‌): వానాకాలం సీజన్‌కు సంబంధించి 27,500 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 19,500 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. కాగా, గతంలో యూరియా బుకింగ్‌ కోసం ఫర్టిలైజర్‌ యాప్‌ వినియోగంలో ఉండేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘ప్రేం వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్స్‌’ పేరిట అన్ని ఎరువుల విక్రయాల కోసం కొత్త యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. అయితే మొదటి యాప్‌లోని సమాచారం, రెండో యాప్‌లోకి రాకపోవడంతో ఇప్పటికే యూరియా తీసుకున్న వారికి మళ్లీ ఎరువులు బుక్‌ అవుతున్నాయి. దీంతో వచ్చిన వారికే డబుల్‌ ధమాక అన్నట్లు రెండేసి సార్లు యూరియా లభ్యం అవుతుంది. ఇక రాని వారికి అసలే రావడం లేదని వాపోతున్నారు. పాపన్నపేటలోని ఓ షాప్‌కు 290 బస్తాల యూరియా రాగా, యాప్‌లో 1000 వరకు బుక్‌ అయ్యాయి. దీంతో రైతులు షాపుకు వచ్చి పడిగాపులు కాసి వెనక్కి మళ్లుతున్నారు. అలాగే పాపన్నపేటలో సాయి సందీప్‌ ఫర్టిలైజర్‌ షాప్‌ లేనే లేదు. గతంలో లక్ష్మీనగర్‌లో ఉన్న షాపు, ఆరు నెలల క్రితమే మూతబడింది. ఈ షాపు పేరిట కూడా వందలాది యూరియా బస్తాలు బుక్‌ కావడంతో షాపు జాడ కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అలాగే వీరభద్ర షాపు లేకున్నా యూరియా బుక్‌ అవుతుంది. అలాగే జిల్లాలోని కొంతమంది అధికారుల లాగిన్‌లు కూడా తప్పుడు మ్యాపింగ్‌ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో అసలు షాపులకు యూరియా ఎంతొస్తుంది, యాప్‌లో స్టాక్‌ ఎంత చూపెడుతుందో తెలియక అటు అధికారులు, ఇటు ఫర్టిలైజర్‌ షాపు యజమానులు, మరో వైపు రైతులు గందరగోళానికి లోనవుతున్నారు. ఈ విషయమై పాపన్నపేట ఏఓ శ్రీనివాస్‌రాజును వివరణ కోరగా కొత్త యాప్‌ కావడంతో కొన్ని తప్పులు దొర్లుతున్నాయన్నారు. త్వరలో సమస్యలు తీరిపోతాయని చెప్పారు. యూరియా కావాల్సినంత ఉందని, ఆందోళన చెందవద్దని సూచించారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిధి బిజ్లిపూర్‌కు చెందిన పలువురు రైతులు యాప్‌లో యూరియా బుకింగ్‌ చేసుకున్నారు. నర్సాపూర్‌ లోని భవాని ఫర్టిలైజర్‌లో ఈనెల 19, 20 తేదీలో యూరియా తీసుకునేందుకు వెళ్లగా, రెండురోజులుగా మూసి ఉంది. అక్కడి నుంచి ఫర్టిలైజర్‌ దుకాణం ఎత్తేసినప్పటికి యాప్‌లో బుకింగ్‌ అవుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్‌ వ్యవసాయ అధికారి దీపిక దృష్టికి తీసుకెళ్లగా.. సదరు ఫర్టిలైజర్‌ షాపును బుకింగ్‌ యాప్‌ నుంచి తొలగించాలని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.

లేని షాపుల పేరిట బుకింగ్‌

గందరగోళంలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement