గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి దరఖాస్తుల ఆహ్వానం 23 నుంచి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట(మెదక్‌): ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పేటలో రూ.34 లక్షలతో సీసీ రోడ్లు, కేజీబీవీ వద్ద రూ.10 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు, మండల పరిధిలోని మక్తలక్ష్మాపూర్‌లో రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ, బూర్గుపల్లిలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాం పనులకు భూమిపూజ చేశారు. రైతులకు ఈ గోదాం పంటలు నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్‌, పీఆర్‌ ఏఈ వెంకట్‌, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్‌, నాయకులు నారాగౌడ్‌, మురళిపంతులు, సంతోష్‌, కుంట్ల రాములు, సుభాష్‌గౌ డ్‌, సుభాష్‌, సుధీర్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్‌, సర్పంచ్‌లు జంగం రేణుక, వెంకట్‌రావు, శ్రీనివాస్‌, విఠల్‌, రాజు గౌడ్‌, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకోవడం అలవర్చుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ సతీశ్‌ సూచించారు. గురువారం మండలంలోని లింగాపూర్‌ రైతు వేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంట సాగుకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పెసర, మినుము, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి తక్కువ నీటి వీటి వినియోగంతో పండే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో పెట్టుబడితో పాటు నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ దీపిక, ఏఈఓలు దుర్గాప్రసాద్‌, తేజస్విని, లావణ్య, రైతులు పాల్గొన్నారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి వద్ద గల డాక్టర్‌ రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యసంస్థ, వ్యవసాయ కళాశాలలో వ్యవసాయం, విత్తన సాంకేతికతలో ఆరునెలల వృత్తివిద్యతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్‌పై ఏడాది ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ఫీల్‌ మేనేజర్‌ జగదీశ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యకు పదో తరగతి పాస్‌, మార్కెటింగ్‌ విద్యకు ఇంటర్మీడియెట్‌ పాస్‌ అయిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. శిక్షణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పంటలసాగు, బోధన, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్‌ 30 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. వివరాలకు 9381959372, 8466942278 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని చేగుంట నుంచి మెదక్‌కు వచ్చే దారిలో ఈనెల 23 నుంచి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకొని బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని కోరారు. నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వయా మిర్జాపల్లి డబుల్‌ రోడ్డు మార్గంలో బస్సులు, కార్లు, డీసీఎంలు వినియోగించుకోవాలన్నారు. అలాగే రామయంపేట నుంచి నర్సాపూర్‌ మార్గం నుంచి ట్రక్కులు, భారీ వాహనాలు వెళ్లాలని సూచించారు. మాసాయిపేట నుంచి మెదక్‌ ప్రయాణించే వాహనాలు దర్పల్లి మీదుగా చిన్నశంకరంపేట మీదుగా చేరుకోవాలన్నారు. తూప్రాన్‌ నుంచి వచ్చే వాహనదారులు వెల్దుర్తి–ఉప్పులింగాపూర్‌, గవ్వపల్లి ద్వారా వెళ్లాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement