● సింగూరుకు రాని మంజీర వరద
● బోసిపోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టు
● గతేడాది రికార్డుస్థాయిలో 210 టీఎంసీల నీరు విడుదల
ఘనపురానికి ప్రాణాధారమైన సింగూరు వెలవెలబోతోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు దాటినా ఎగువన వర్షాలు లేక కేవలం4.7 టీఎంసీలకు పరిమితమైంది. దీంతో మంజీర ఝరి కరువై.. ఘనపురం ఆనకట్ట, వాన నీళ్లతోనే పొంగిపొర్లుతోంది. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి దీనంగా ఉంది. గతేడాది వర్షాకాలంలో మంజీర పరవళ్లు తొక్కడంతో సింగూరు నుంచి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 210 టీంఎసీల నీరు దిగువకు వదిలారు.
పాపన్నపేట(మెదక్): మహారాష్ట్రలోని బాలాఘాట్‌లో జన్మించిన మంజీర నది మెతుకుసీమ వ్యవసాయానికి ఊపిరి పోస్తుంది. దీనిపై ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు కట్టారు. దిగువన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ వద్ద మరో ప్రాజెక్టు నిర్మించారు. అయితే మహారాష్ట్ర, బీదర్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో వర్షాలు లేక పోవడంతో మంజీర నదికి వరద రాలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 4.7 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. గతేడాది ఆగస్టు మొదటివారంలో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండేది.
వాననీళ్లతో ఘనపురం కళకళ
ఎగువన కురిసిన వర్షాలతో ఘనపురం ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. 0.135 టీఎంసీల సామర్థ్యం గల ఈ ఆనకట్టపై నుంచి 1000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. వానాకాలం పంటల కోసం అధికారులు ఫతేనహర్ కెనాల్ ద్వారా 13 చెరువులు నింపారు. ఇక ఎంఎన్ కెనాల్ నక్కవాగు, హల్దీవాగు, స్థానిక గుట్ట జలాల ద్వారా నిండుగా ప్రవహిస్తుంది.
బోసిపోయిన నిజాంసాగర్
మంజీర వరదలు లేక..సింగూరు నీరు రాక నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతుంది. దీని నిల్వనీటి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.690 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువన పోచారం, హల్దీవాగులద్వారా నీటి ప్రవాహం వస్తుండటంతో , నిజాంసాగర్‌లోకి కొంతమేర నీరు చేరే అవకాశముంది.


